కోదాడ, ఏప్రిల్ 25 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కోదాడలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభతో కాంగ్రెస్ మోసపూరిత హామీలు, దాష్టికం వెల్లడి కానున్నట్లు తెలిపారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతకాక చేతులెత్తేసిందని విమర్శించారు. కోదాడలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్దే కనిపిస్తుంది తప్పా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు.
కోదాడ నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేల సంఖ్యలో సభకు కదలి రావాలని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, పెద్ద ఎత్తున హాజరై కాంగ్రెస్ పై ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేయాలన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ సంవత్సరన్నర కాలానికే ప్రజాగ్రహానికి గురైందని విమర్శించారు. కోదాడ నియోజకవర్గంలో అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి ప్రజలను మోసం చేశారే తప్పా అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరోపించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుంకర అజయ్ కుమార్, జానకి, రామాచారి, శీలం సైదులు, భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎస్కే నయీమ్, పొట్ట కిరణ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్, షర్టు సురేశ్, ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.