నల్లగొండ, రూరల్, మార్చి 24 : ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో గల ఆర్జాలభావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టి తేమను పరీక్షించుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అంతేకాక క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నదని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లలో రైతులు పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాలు, ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు.
ఈ యాసంగిలో జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు, అవసరమైతే ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు, నీడకు సంబంధించి ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లు న్యాయంగా వ్యాపారం చేయాలన్నారు. తేమ పేరుతో అనవసరంగా రైతులను ఇబ్బందులు చేయవద్దని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Grain Procurement : ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండను ప్రథమ స్థానంలో నిలుపుదాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఉగాది నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నుండి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ధాన్యం రీసైకిలింగ్ అయ్యే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏఎంఆర్పీ, ఉదయ సముద్రం ద్వారా సాగునీరు అందించామని, దీనివల్ల ఈ సంవత్సరం లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, ఎల్లారెడ్డిగూడెం వరకు సాగునీరు అందిస్తున్నామని, శ్రీశైలం హైడెల్ ప్రాజెక్టు ద్వారా ఏఎంఆర్పీ నుండి నీరు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల పూర్తి చేయడం ద్వారా మర్రిగూడెం చెరువుకు నీళ్లు ఇస్తామని, కాల్వల ద్వారా నీరు అందించేందుకు భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని, బ్రాహ్మణ వెల్లేముల ద్వారా కట్టంగూరు, నార్కెట్‌పల్లి, మునుగోడులో రానున్న మూడు, నాలుగు నెలల్లో కాల్వలు పూర్తయితే లక్ష ఎకరాలకు నీరు అందనున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ధాన్యాన్ని ధృవీకరించాలని చెప్పారు. దొడ్డు, సన్న ధాన్యాన్ని వేర్వేరుగా నింపాలని, ధాన్యం కొనుగోలుకు ప్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ స్క్వాడ్స్ ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి రెండు సీజన్లకు సాగునీరు అందించడం వలన లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందన్నారు. ధాన్యం రాకను బట్టి అవసరమైతే కోనుగోలు కేంద్రాలు పెంచుతామన్నారు. గత సంవత్సరం సన్న బియ్యం 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన రైతులకు రూ.22 కోట్లు బోనస్ చెల్లించడం జరిగిందని, వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువమంది రైతులు సన్న ధాన్యం పండించడంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరీశ్, డీఆర్డిఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేశ్, సీఈఓ అనంతరెడ్డి పాల్గొన్నారు.