బొడ్రాయిబజార్, డిసెంబర్ 24 : బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా ఈ నెల 29న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తూ ఇతర పార్టీలను తమ పార్టీలో కలుపుకొంటుందని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలను ఎండగట్టిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఈడీ దాడులకు ఉసిగొల్పుతున్నదన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధీటుగా పోరాటాలు చేస్తున్నందు వల్లే ఆయనతో కలిసి మునుగోడు ఉప ఎన్నికలో పని చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును సీపీఎం స్వాగతిస్తున్నదన్నారు.
భవిష్యత్‌లోనూ బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామని తెలిపారు. డిసెంబర్ 29న జరిగే బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరవుతున్నారన్నారు. విస్తృతస్థాయి సమావేశం ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని సీపీఎం సీనియర్ నాయకుడు రాచమల్ల రామస్వామి ఆవిష్కరించారు. జిల్లా కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరావు, బుర్రి శ్రీరాములు, ధీరావత్ రవినాయక్, మట్టిపల్లి సైదులు, కోట గోపి, ఎల్గూరి గోవింద్, పారెపల్లి శేఖర్‌రావు, దండ వెంకట్‌రెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, జుట్టుకొండ బసవయ్య, దేవరం వెంకట్‌రెడ్డి, బుర్ర శ్రీనివాస్, నాగారపు పాండు, పల్లె వెంకట్‌రెడ్డి, కందాల శంకర్‌రెడ్డి, చెరుకు ఏకలక్ష్మి, పులుసు సత్యం, జిల్లపల్లి నర్సింహారావు పాల్గొన్నారు.