చండూరు, జూన్ 02 : అబద్దాలతో, బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు, కోట్లాది ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితం. 1969 జై తెలంగాణ ఉద్యమం నుండి 2014 రాష్ట్ర ఆవిర్భావం వరకు సాగిన ఈ మహోద్యమం విద్యార్థుల త్యాగాలు, ప్రజల సంకల్పం, అమరవీరుల బలిదానాలతో చరిత్రలో నిలిచిపోయిందన్నారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే బలమైన సంకల్పంతో కేసీఆర్ స్వప్నించి, పోరాడి సాధించాడు. తెలంగాణ కేవలం రాష్ట్రం కాదు, కోట్లాది ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితం. గత బీఆర్ఎస్ 10 ఏళ్లలోనే 75 ఏళ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతి సాధించి దేశానికి మార్గదర్శనం చేసిందన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో నంబర్-వన్ స్థానాన్ని సాధించింది. ఆంధ్రా నాయకుల కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
కానీ అబద్ధాల మాటలతో, బుటకపు హామీలతో గద్దెనెక్కిన ఈ కపట కాంగ్రెస్ గత రెండున్నర సంవత్సరాల నుండి మళ్లీ సీమాంధ్ర నాయకులు చేతుల్లోకి వెళ్లి తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు కండ్లల్లో కన్నీళ్లు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో, ఇప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితమై, మళ్లీ మరో తెలంగాణ ఉద్యమం లాగా కలిసికట్టుగా పనిచేసి రానున్న రెండు సంవత్సరాలల్లో బిఆర్ఎస్ పార్టీనీ అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, నాయకులు కొత్తపార్టీ సతీష్, పెద్దగోని వెంకన్న, బొడ్డు సతీష్ గౌడ్, కౌన్సిలర్లు సామ సుజాత, నాయకులు చొప్పరి దశరథ, చిలువేరు నరేష్, సంఘపు సువర్ణ, పెండ్యాల గీత, గోనె హరినాధరావు, తేలుకుంట్ల జానయ్య, రావిరాల నగేష్, గండూరి జనార్ధన్, భూతరాజు వెంకన్న, తంధారి రవి, కరుణాకర్ రెడ్డి, మహమ్మద్ గౌస్, చొప్పరి శంకర్, రాపోలు జగదీష్, చొప్పరి లింగస్వామి, బోడ మోహన్, వీరమల్ల స్వామి, కట్కూరి సత్తయ్య, కంబాలపల్లి వెంకన్న, కోటి శ్రీనివాస్, వర్కాల శ్రవణ్, కట్కూరి నరసింహ, కట్కూరి వెంకట్ పాల్గొన్నారు.