అర్వపల్లి, మే 22 : కామ్రేడ్ ప్రభాకర్ ఆశయ సాధనకై కలిసికట్టుగా పోరాడాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండారి ప్రభాకర్ అమరుడై ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. దోపిడీ, పీడనలు లేని సమాజంకై పోరాడుతూ అమరుడైన ప్రభాకర్ త్యాగం మరువలేనిదన్నారు. అనతి కాలంలోనే అశేషమైన ప్రజల అభిమానం చూరగొని ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా మిగిలిపోయాడని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అక్రమ అరెస్టులు, జైలు జీవితాన్ని గడిపి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడిన మలిదశ తెలంగాణ నాయకుడైన ప్రభాకర్ ఎప్పుడు సజీవంగానే ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, సైదులు, సిద్ధార్థ, నాగెళ్లి సంపత్, మల్లేష్, లక్ష్మీనారాయణ, యాదయ్య, లింగయ్య పాల్గొన్నారు.