కోదాడ, మార్చి 23 : బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ దాస్య శృంఖలాలు తెంచేందుకు చిరునవ్వుతో ఉరికొయ్యని ముద్దాడిన వీర పుత్రులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని ప్రజాశక్తి నివేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర ఉద్యమకారులు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక ఎం.ఎస్ కళాశాలలో నిర్వహించిన సంస్మరణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దోపిడీ, పీడన, అణిచివేత, అసమానతలు లేని సమాజాన్ని కలలుగన్న సంగ్రామ శక్తి అని కొనియాడారు. అది నేటికి నెరవేరలేదని ఆ వైపుగా నేటి యువతరం ఆలోచించాలన్నారు. నేడు సామ్రాజ్యవాద అమెరికా అహంకారపూరితంగా మూడో ప్రపంచ దేశాలపై తన పెత్తనాన్ని చలాయించడానికి కాలు దువ్వుతుందన్నారు.
వ్యతిరేకించిన దేశాలపై దాడులకు పూనుకుంటూ ఆ దేశాధి నేతలను హత్య చేయిస్తున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అమెరికా దాని తొత్తు ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడి చేయడాన్ని భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో ముక్తకంఠంతో అంతా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిపిటిఎఫ్ నాయకులు రాపర్తి రామ నరసయ్య, ముత్తవరపు రామారావు, కోటయ్య, జే ఆర్ కే మూర్తి, బడుగుల సైదులు, జి ఎల్ ఎన్ రెడ్డి, రాఘవ రెడ్డి, వి.నరసింహారావు, ఉదయగిరి, ఎన్.హరికిషన్ రావు, ఎస్.భిక్షం, అలుగువెల్లి సత్యనారాయణ రెడ్డి, వెంకటరత్నం, మామిడి రామారావు, అప్పిరెడ్డి కైలాసం, వెంకటేశ్వర్లు, బంక వెంకటరత్నం పాల్గొన్నారు.