రామగిరి, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ గ్రామీణ్ విబి జి రామ్ జి 2025 తీసుకురావడానికి నిరసిస్తూ సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నాయకులు నల్లగొండ పట్టణంలోని సుభాష్ సెంటర్లో మంగళవారం నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్.హశం, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగంగానే పథకం పేరుని మార్చడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా పెట్టుబడిదారులు అదానీ, అంబానీలకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు చేస్తూ పేదలకు ఉపాధిని దూరం చేసే చర్యల్లో భాగంగా పేరు మార్చడం జరిగిందని వారు విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను కేటాయించకుండా రాష్ట్రాలకు 40 శాతం నిధులు కేటాయించాలని చెప్పడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైందన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలు, కూలీలు ఇప్పటికే పనులు దొరకక వలసలు పోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఇలాంటి చట్టం తేవడం పేదలకు అన్యాయం చేయడమేనని వారు విమర్శించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బోలుగూరి నరసింహ, వి.లెనిన్, ఎండీ.అక్బర్, సుజాత, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు చిరంజీవి, బొంగురాల నర్సింహ, వామపక్ష పార్టీల కార్యకర్తలు విజయ, ఎం.ముత్యాలు, పండరి, అక్కలయ్య, వీరయ్య, షరీఫ్ మదర్, అవుట రవీందర్, తుమ్మల పద్మ, కృష్ణారెడ్డి, పోలె సత్యనారాయణ, బివి చారి, రావుల నరేశ్, కల్లూరి అయోధ్య, అంజయ్య, అనురాధ, బుజ్జమ్మ పాల్గొన్నారు.