నల్లగొండ ప్రతినిధి, ఏఫ్రిల్16(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా విడుదల చేసిన కులగణన, ఇంటింటి సర్వే వివరాలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రభుత్వం ప్రకటించిన వివరాలు అసమగ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంటింటి సర్వే పేరుతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ వివరాల కోసం నిర్వహించిన కుల గణనలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆది నుంచీ విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ సర్వేలో పూర్తి స్థాయిలో ప్రజలు పాల్గొన లేదన్నది నిజం. పాల్గొన్న జనం సైతం సమగ్రంగా వివరాలు అందించేందుకు పెద్దగా ఆసక్తి కనపర్చలేదని సర్వే జరుగుతున్న సమయంలోనే క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేశాయి. అయితే సర్వే పూర్తయిన తర్వాత డిడెకేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ నివేదికలోని పూర్తి వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులోనూ ముఖ్యంగా బీసీ జనాభా విషయంలో ఆది నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగానే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ముస్లిం మైనార్టీల్లోని బీసీలతో సంబంధం లేకుండానే బీసీల జనాభా 54 శాతానికి పైగా ఉందని అంచనా. కానీ ప్రస్తుత వివరాల్లో వారితో కలిపినా కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉన్నట్లు తేల్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని బీసీ సంఘాల నేతలు ఈ వివరాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరకొర సర్వేతో అస్పష్ట సమాచారంతో బీసీ వర్గాలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం వెల్లడించిన ఇంటింటి సర్వే తాజా వివరాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 5,86,450 బీసీ కుటుంబాలు ఉన్నాయి. అయితే వీటికి ముస్లిం మైనార్టీల్లోని బీసీ కుటుంబాలు అదనం. అవి 56,545 కుటుంబాలుగా లెక్క తేల్చారు. మొత్తంగా చూస్తే 6,42,995 బీసీ కుటుంబాలు ఉన్నట్లు సర్వే నివేదికలో వెల్లడించారు. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం కుటుంబాల సంఖ్య11,43,936గా లెక్క తేల్చారు. అయితే ఈ సంఖ్య 2011 జనాభా లెక్కల సేకరణ సమయంలోని వివరాలకు కొద్దీగా అటుఇటుగా ఉండడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత 13 ఏండ్లలో లెక్క పెరగాలే కానీ ఇంచుమించు అదేస్థాయిలో ఉండటం ఏంటన్న చర్చ సాగుతోంది. మొత్తం కుటుంబాల్లో కేవలం బీసీలు 51.26 శాతం కాగా వీరికి ముస్లింలలోని బీసీ కుటుంబాలు 4.94శాతం అదనం. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా చూస్తే 56.20 శాతం బీసీ కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. ఇక ఇదే సమయంలో ఇతర ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు సంబంధించిన కుటంబాల లెక్కల్లోనూ గందరగోళమే నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని బీసీ జనాభా 50.85 శాతంగా ఇంటింటి సర్వే స్పష్టం చేసింది. అయితే ఇది వాస్తవ దూరంగా ఉందని, మరో మూడు నాలుగు శాతం అదనంగా ఉంటుందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సర్వే నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 34,80,057 మంది జనాభా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 16,03 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 10.72 లక్షలు, యాదాద్రి జిల్లాలో 8.04లక్షల జనాభా ఉన్నట్లు తేల్చారు. అయితే ఈ మొత్తం జనాభాలో బీసీ జనాభాను వేరుగా, ముస్లింలలోని బీసీ జనాభాను వేరుగా ప్రభుత్వం చూపింది. నల్లగొండ జిల్లాలో 7,86లక్షలు, సూర్యాపేటలో 5.01లక్షలు, యాదాద్రిలో 4.80లక్షల బీసీ జనాభా ఉన్నట్లు చూపారు. మొత్తంగా ఇది 17,69,748గా నమోదైంది. ఇది మొత్తం జనాభాలో 50.85శాతం. ఇక వీరికి అదనంగా ముస్లింలలోని బీసీ జనాభాను ప్రత్యేకంగా చూపగా నల్లగొండలో 88,168, సూర్యాపేటలో 62,885, యాదాద్రిలో 28,192 మంది ఉన్నట్లు తేల్చారు. వీరి జనాభా 5.15శాతంగా చూపారు. అయితే మొత్తంగా చూస్తే 19,48,993 మంది బీసీ జనాభాతో 56 శాతంగా ఉన్నట్లు తేలింది. అయితే ఇది మరింత ఎక్కువ ఉంటుందని బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచీ రాజకీయ లబ్ధి కోణంలోనే బీసీ వర్గాలను చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మోసపూరిత వాగ్ధానాలు చేయడం తర్వాత అటకెక్కించడం పరిపాటైందని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారు. ఏదో మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామంటూ చేతులు దులుపుకున్నారు. కేంద్రంపై నెపం నెట్టి 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు లేకుండా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి బీసీలకు మొండిచేయి చూపారు. ఇక తాజాగా ప్రకటించిన ఇంటింటి సర్వేలో సైతం బీసీ జనాభాను తక్కువగా చూపుతూ మరోసారి తమ మోసపూరిత వైఖరిని ప్రదర్శించారు. వివిధ సంక్షేమ పథకాల విషయంలోనూ రేవంత్రెడ్డి సర్కార్ బీసీలను దారుణంగా మోసం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా సర్వే వివరాలపై బీసీ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకి లెక్కలతో తమ ప్రాబల్యాన్ని తగ్గించి చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధిచెప్పి తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరిస్తున్నారు.
చౌటుప్పల్, ఏప్రిల్ 16: బడుగు, బలహీన వర్గాల్లో ఉన్న బీసీ ఉపకులాల కన్నా ముస్లింలే అధికమని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం సరి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతూ జనాభాలో అధికంగా ఉన్న బీసీలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. బీసీలు రాజకీయంగా మరింత ఎదిగితే అగ్రవర్ణాల ఆటలు సాగవని కొత్త నాటకానికి తెర లేపుతోంది. బీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాజకీయంగా ఎదగకుండా అణిచి వేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. సమగ్ర కుల గణన సర్వేలో ఏనాడూ లేని విధంగా ఆగ్ర కులాల సంఖ్య పెంచి చూపించండంలో ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవాలి. సర్వేలో కూడా బీసీ కులాల జనాభాను కింద మీద చేసి చూపించింది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఇకనైనా బీసీలను కించపరిచేవిధంగా చెయ్యవద్దు. రానున్న రోజు ల్లో కాంగ్రెస్కు బీసీలే తగిన బుద్ధి చెప్పుతారు. మళ్లీ కులగణన చేయాలి.
– వీరమళ్ల కార్తీక్ గౌడ్, బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు
కోదాడ, ఏప్రిల్ 16 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా విడుదల చేసిన కుల గణన సర్వే నివే దిక తప్పుల తడకగా ఉంది. బీసీ జనాభా రాష్ట్రంలో 46 శాతం మాత్రమేనని సర్వే లో ప్రకటించడం హాస్యాస్పదం. ఈ సర్వే శాస్త్రీయంగా లేదు. బడుగు, బలహీన వర్గాల వారిలో సగం శాతం పైగా ఆర్థికంగా బలంగా ఉన్నారని చెప్పటం ఈ సర్వే అబద్ధాల పుట్ట అని స్పష్టం చేసింది. మొత్తం ముస్లింల జనాభా 10.9 శాతమైతే బీసీఈలోని ముస్లిం ఉపకులాల జనాభా 9.1.3 శాతంగా చూపడం శోచనీయం.. గొల్ల కురుమ, ముదిరాజ్, విశ్వకర్మ, మున్నూరు కా పు, గౌడల కుల గణన అసంబద్ధంగా ఉంది. పైగా ఓసీ ల్లో రెడ్ల సంఖ్య ఎక్కువగా చూపటం ఆశ్చర్యకరం.
– బట్టు శివాజీ, రైతు సంఘం నాయకుడు
మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 16: ప్రభు త్వం విడుదల చేసిన బీసీ కులగణన అం తా తప్పుల తడక. కుల గణన పారదర్శకంగా జరగలేదని సు స్పష్టంగా తెలుస్త్తోం ది. జనాభాలో 60శాతానికి పైగా ఉన్న బీసీలను 46శాతంగా చూపించి, వారి హక్కులను కాలరాసే విధంగా చేపట్టిన సర్వేగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిం టి సర్వేలో దూరప్రాంతాల్లో ఉన్నవారు సైతం తమ గ్రామాలకు చేరుకొని సర్వేలో పాల్గొన్నారు. కానీ, ఇప్పుడు అలా జరగలేదు. ప్రధానమంత్రి ఒక బీసీ అయిఉండి కూడా 4శాతం ఉన్న ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10శాతం రిజర్వేషన్లను కల్పించి బీసీలకు మరింత అన్యాయం జరిగేలా చేశారు. బీసీలను ఇప్పటికి అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. బీసీలకు ఎప్పటికీ రాజ్యాధికారం దక్కవద్దనే ఉద్దేశంతోనే ఈ కులగణన జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి పారదర్శకంగా కులగణన చేయాలి. లేనిపక్షంలో బీసీలంతా ఏకమై బీసీ వ్యతిరేక పార్టీలకు తగిన గుణపాఠం చెబుతాం.
– పగిడి జీడయ్య యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్