నల్లగొండ, డిసెంబర్ 25 : తమది ఎంతో క్రమ శిక్షణగల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమ కార్యాలయంలోనే తన్నుకున్న సంఘటన బుధవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో తలెత్తిన పంచాయితీతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్ మధ్య రగిలిన పంచాయితీ చివరకు తన్నుకునే వరకు వచ్చింది. అయితే ఇరు వర్గాల నేతలు తన్నుకుంటున్నా పార్టీ సీనియర్ నేతలు మాత్రం మౌనంగా ఉండటంతో నాగం అనుచరుడు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రెడ్డి రామరాజుపై పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఈ ఘర్షణలో ఆయన కళ్లద్దాలు సైతం పగిలిపోయాయి. అనంతరం రామరాజు తన క్యాడర్‌ను మొత్తం పార్టీ కార్యాలయం వద్దకు రమ్మని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఫొటోలు తీస్తున్న శ్రీనివాస్ అనే ఫొటో జర్నలిస్టు కెమెరాను వర్షిత్ రెడ్డి లాక్కొని ఫొటోలు డిలీట్ చేయటంతో జర్నలిస్టులు ధర్నా చేస్తూ నాగం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించి, ఈ నెల 24న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఆహ్వానించారు. ఆయన మొదట వస్తానని చెప్పి అనంతరం రాకపోవటంతో పార్టీ పెద్దలు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో బీసీ నేత పిల్లి రామరాజు కనీసం నల్లగొండ నియోజక వర్గంలో గెలిచిన వాళ్లనైనా సన్మానించాలని జిల్లా అధ్యక్షుడు నాగం అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే మొదట ఓకే చెప్పిన నాగం అనంతరం వద్దని చెప్పినట్లు తెలిసింది. అయితే నల్లగొండ నియోజక వర్గంలో మేళ్లదుప్పల పల్లి నుంచి అది కూడా బీఆర్ఎస్ మద్దతుతో కోమటిరెడ్డి నర్సింహారెడ్డి అని ఒకే ఒక సర్పంచ్ గెలిచాడు. ఆయన ఆఫీసుకు రావటం..ఇదే రోజు వాజ్‌పేయ్ వర్థంతి ఉండటం వల్ల నాగం, రామరాజులు పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడికి వచ్చిన సర్పంచ్‌ను వర్షిత్ రెడ్డి సన్మానించటంతో నన్ను వద్దని చెప్పి, నువ్వు ఎందుకు సన్మానిస్తున్నావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దాంతో నాగం అనుచరుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పకీర్ మోహన్ రెడ్డి రామరాజుపై దాడి చేసినట్లు తెలిసింది. అయితే ఈ ఘర్షణలో రామరాజు కళ్లద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనను శ్రీనివాస్ అనే ఫొటో జర్నలిస్టు ఫొటోలు తీస్తుండగా వర్షిత్ రెడ్డి కెమెరా లాక్కొని డిలీట్ చేశారు.
ఫొటో జర్నలిస్టు శ్రీనివాస్ దగ్గర కెమెరాను లాక్కొని ఫొటోలను డిలీట్ చేసిన నాగం వర్షిత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు ఓ వైపు పార్టీ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తుండగా..మరోవైపు తనపై దాడి చేసిన వర్షిత్ రెడ్డిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని రామరాజు డిమాండ్ చేస్తూ తన అనుచరులతో కార్యాలయాన్ని ముట్టడించటంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టూటౌన్ ఎస్ఐ అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా గత పార్లమెంటు ఎన్నికల తర్వాత తనపై వర్షిత్ రెడ్డి దాడి చేయించాడని పాలకూరి రవి అనే బీజేపీ కార్యకర్త అప్పట్లో ఆరోపణలు చేశాడు. ఎట్టకేలకు బీజేపీ సీనియర్ నేతలు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్‌రెడ్డి చొరవ తీసుకుని నాగం వర్షిత్‌రెడ్డితో మీడియాతో పాటు పిల్లి రామరాజుకు క్షమాపణలు చెప్పించడంతో సమస్య సద్దుమణిగింది.