హుజూర్ నగర్, ఏప్రిల్ 4: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. గోదావరిఖని న్యాయవాది నూతి సురేష్‌పై దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని (Huzurnagar) కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో న్యాయవాదులపై భౌతికదాడులు అధికమయ్యాయన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, ముఖ్యంగా న్యాయవ్యవస్థకు గొడ్డలి పెట్టని చెప్పారు. రాజ్యాంగానికి విధేయులుగా, తమ కక్షిదారులను రక్షించేందుకు చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై భౌతిక దాడులు జరపటం అత్యంత జుగుప్సాకరని తెలిపారు.
ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల బహిష్కరణ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ బార్ అసోసియేషన్ తీర్మాన కాపీలను రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్యాం శ్రీ, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, జక్కుల నాగేశ్వరరావు, సుంకరి ప్రదీప్తి, తెప్పని శ్రీలక్ష్మి, చేకూరి శృతి, కుక్కడపు బాలకృష్ణ, ధూళిపాల శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, చల్లా కృష్ణయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, కొట్టు సురేష్, పాలేటి శ్రీనివాసరావు, ఉదారి యాదగిరి, బానోతు శ్రీను నాయక్, నాగూర్ పాషా, శివ తదితరులు పాల్గొన్నారు.