నందికొండ, ఆగస్టు 9 : కృష్ణమ్మ వరద జోరుతో నాగార్జున సాగర్ జలాశయం తొణికిసలాడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,94,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా శుక్రవారం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించారు. 4 గేట్లు 10 అడుగులు, 22 గేట్లు 5 అడుగుల ఎత్తుతో 2,77,453 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నెల 5న నీటి విడుదల ప్రారంభం కాగా, రోజూ 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు 587.30 (305.6838 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జురాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో వాటిల్లోకి వచ్చిన వరద వచ్చినట్టే సాగర్‌కు చేరుకుంటున్నది.
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లతోపాటు ఎడమ కాల్వ ద్వారా 8,367 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8,452 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,29,886 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,948 క్యూసెక్కులు, ఎస్ఎల్బీబ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదలను చూసి సంతోషించేందుకు పర్యాటకులు నిత్యం తరలివస్తున్నారు. డ్యామ్ కొత్త బ్రిడ్జి, శివాలయం పుష్కరఘాట్, జలవిద్యుత్ కేంద్రం, డ్యామ్ పిల్లర్, లాంచీస్టేషన్, దయ్యాల గండి పరిసరాలు సందడిగా
కనిపిస్తున్నాయి.
చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 (45.77 టీఎంసీలు) అడుగులకు గానూ 167.714 (35.1981 టీఎంసీలు) అడుగుల వద్ద మేరకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2,30,031 క్యూసెక్కులు ఉండడంతో 11 గేట్లను ఎత్తి 2,30,114 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో గేట్ల నుంచి 12,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా మొత్తం 2,42,114 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. 12,000 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్ల ద్వారా 80 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు.