సూర్యాపేటటౌన్, మే 26: ‘సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం సొంత తమ్ముడి హత్యకు కారణమై కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మేకల జయరాములు(50)కు తన అన్న కృష్ణయ్యతో వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల కృష్ణయ్య కుమారుడు పొలంలో బోరు వేయించడంతో ఈ వివాదం మరింత ముదిరి జయరాములు హత్యకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య భూ వివాదమే హత్యకు దారి తీసింది. అన్న కుటుంబ సభ్యులు, ఇంటి పక్కన వ్యక్తి కలిసి పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డారు’ అని జిల్లా ఎస్పీ నర్సింహ తెలిపారు. సోలిపేటలో సోమవారం రాత్రి జరిగిన మేకల జయరాములు హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నాలుగు సెల్ఫోన్లు, హత్యకు వినియోగించిన గొడ్డలి, స్కూటర్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. సోలిపేట గ్రామానికి చెందిన మేకల జయరాములు(50)కు కొన్నేండ్లుగా తన అన్న కృష్ణయ్యతో వ్యవసాయ భూమి గెట్టు విషయంలో వివాదం నెలకొందన్నారు.
ఈ క్రమంలో రాంచీలోని సీఐఎస్ఎప్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కృష్ణయ్య కుమారుడు కిరణ్, అతడి భార్య మౌనిక పది రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. వివాదాస్పద పొలంలో బోరు వేసి మోటార్ ఫిట్ చేశారు. అక్కడే కుటుంబ సభ్యులతో పాటు మట్టపల్లి రామచంద్రయ్య కలిసి విందు చేసుకొని భూమి పంచాయితీలో తలనొప్పిగా మారిన జయరాములును చంపాలని పథకం రచించారు. దావత్ అనంతరం అందరూ ఇంటికి పోయినప్పటికి కిరణ్ అతని భార్య మౌనిక పొలం వద్ద కాచుకు కూర్చున్నారు. సాయంత్రం జయరాములు పొలం వద్దకు రాగానే అదను చూసి కిరణ్ అతడి భార్య మౌనిక దాడి చేసి గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి హత్య చేసి పారిపోయారు. నిందితులు మంగళవారం మధ్యాహ్నం హైటెక్ బస్టాండ్‌లో బస్సు ఎక్కి పారిపోవాలని చూస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో దాడి చేసి నిందితులు మేకల కిరణ్, మేకల మౌనిక, మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, మట్టపల్లి రామచంద్రులను అరెస్టు చేశారు. హత్యకు వినియోగించిన గొడ్డలి, స్కూటర్, నాలుగు సెల్ఫోన్లను సీజ్ చేశారు. కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమర్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయకర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
సూర్యాపేటటౌన్, మే 26: సూర్యాపేట మండలం సోలిపేటలో సోమవారం రాత్రి మేకల జయరా ములు(50) హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చి మంగళవారం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో జయరాములు భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబీకులను పరామర్శించారు.

జయరాములు హత్యకు దారి తీసిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. హంతకులు ఎంతటి వారైనా వదిలి పెట్టకుండా.. చట్టపరంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం ఉన్నారు.