భూదాన్ పోచంపల్లి, జూలై 12 : రంగారెడ్డి జిల్లా గౌరెల్లి నుంచి భద్రాది కొత్తగూడెం వరకు చేపడుతున్న జాతీయ రహదారి -930 నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు జాతీయ రహదారుల సంస్థ ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ డివిజన్ పరిధిలో గల వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో భూ సేకరణ చేయనున్నారు. ఇందుకోసం భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో భూ నిర్వాసితులు, రైతులతో సమావేశమై అధికారులు అభిప్రాయాలు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. జాతీయ రహదారి -930 తో పిలిచే ఈ రహదారి హైదరాబాద్ నుంచి భద్రాది కొత్తగూడెం వరకు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.675.45 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. పోచంపల్లి, వలిగొండ, మోతూర్, అడ్డగూడూరు మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ నుంచి భద్రాది కొత్తగూడెం వరకు జాతీయ రహదారి చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా గౌరెల్లి నుంచి యాదాద్రి జిల్లాలో సుమారు 42 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డును నిర్మించనున్నారు. 150 ఫీట్ల వెడల్పుతో నిర్మించే ఈ రోడ్డు యాదాద్రి జిల్లాలో సుమారు 37 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోడ్లతో సంబంధం లేకుండా పూర్తిగా నూతన రోడ్డుకు ప్రతిపాదించారు. ఆయా గ్రామాల మీదుగా కొత్త రోడ్డు నిర్మాణంతో మరో జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులో రానున్నది. ఆయా గ్రామాలకు వెళ్లకుండా పూర్తిగా బైపాస్ వేయనున్నారు. తాజాగా గౌరెల్లి -భద్రాది కొత్తగూడెం రోడ్డుతో జిల్లాలో రవాణా వసతులు మెరుగుపడనున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. జాతీయ రహదారులతో భూములు ధరలు పెరగడం, కొత్త పరిశ్రమలు రావడం, ప్రయాణ దూరం తగ్గడంతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కానున్నాయి.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి నుంచి భద్రాది కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గౌరెల్లి-వలిగొండ సెక్షన్లో 455 ఎకరాలు భూమిని సేకరించనున్నారు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలో భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి, కనుముక్కుల, దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, జగత్పల్లి, జూలూరు, పిలాయిపల్లి, పోచంపల్లి, మెహర్‌నగర్, వలిగొండ మండలంలో లోతుకుంట, మల్లెపల్లి, పొద్దుటూరు, రెడ్లరేపాక, సంగెం గ్రామాల్లో రోడ్డు విస్తరణ వెడల్పు కోసం అవసరమైన భూమికోసం నోటిఫికేషన్ వేశారు. మండలంలో చౌటుప్పల్ ఆర్డీఓ, తాసిల్దార్ సమక్షంలో రైతులతో సమావేశం పరిచి అభిప్రాయం అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన 21 రోజుల్లోపు చౌటుప్పల్ ఆర్డీఓ కా ర్యాలయంలో రైతులు తమ అభ్యంతరాలు తెలుపాలని చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మండల తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మూసీ పరీవాహ ప్రాంతంలో రైతులకు వ్యవసాయమే జీవనాధారం. తనకున్న భూమిలో పంటలు పండించుకొని జీవిస్తున్నారు. జాతీయ రహదారుల కోసం భూములు ఇవ్వడానికి రైతుల సిద్ధంగా లేరు. ప్రస్తుతం బహిరంగ మారెట్లో ఒక ఎకరానికి రూ.80 లక్షలు విలువ చేస్తే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ఎకరాకు రూ.24 లక్షలు మాత్రమే ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం విలువ ప్రకారం ఇచ్చే పరిహారం తమకు గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి ప్రభుత్వం రూ.24 లక్షలు ఇస్తే 10 గుంటల భూమి కూడా రావడం లేదని, రెండెకరాలు భూమిని ఇస్తే మేం బతికేది ఎట్లా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మారెట్ ప్రకారం రేటును ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భూమిని ఇవ్వమని రైతులు తేల్చి చెబుతున్నారు.
ఎకరాకు రూ. 24.50 లక్షలు పరిహారం
గౌరెల్లి -భద్రాది కొత్తగూడెం జాతీయ రహదారి నిర్మాణంలో భూ నిర్వాసితులకు ప్రభుత్వం మారెట్ విలువ ప్రకారం ఎకరానికి రూ.24.50 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుందని చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి తెలిపారు. భూదాన్ పోచంపల్లిలో శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కనుముకుల, దంతూరు గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులతో ఆయన సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నామని, ఒక ఎకరం, రెండెకరాల సన్న, చిన్న కారు రైతులు భూమిని ఇస్తే జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో కనుముకుల గ్రామంలో 79 మంది రైతుల నుంచి 26.15 ఎకరాలు, దంతూరు గ్రామంలో 38 మంది రైతుల నుంచి 25 ఎకరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఎకరానికి 24.50 లక్షలు చెల్లిస్తుందని చెప్పారు. ఏవైనా అభ్యంతరాలున్నా, నష్టపరిహారం ఎకువ కావాలన్నా కలెక్టర్‌కు విన్నవించుకోవచ్చని తెలిపారు. రైతుల అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేవంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకటయ్య, సీనియర్ అసిస్టెంట్ సురేందర్శర్మ, ఎంఆర్ఐ గుత్తా వెంకటరెడ్డి, మండల సర్వేయర్ సాయికుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాక మల్లేశ్‌యాదవ్, మాజీ సర్పంచులు కోట అంజిరెడ్డి, దోటి కుమార్, నాయకులు కోట రామచంద్రారెడ్డి, కొండల్‌రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.