విద్యా రంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం విస్మయం గొల్పుతున్నది. కేసీఆర్ సర్కారులో పాఠశాలల ప్రారంభం నాటికే పాఠశాల నిర్వహణ(కాంపోజిట్ గ్రాంట్)ను ఆయా పాఠశాలలకు రెండు విడుతల్లో విడుదల చేసేది. కాంగ్రెస్ పాలనలో మాత్రం నెలలు గడుస్తుడడంతో పాఠశాలల నిర్వహణ కష్టంగా మారుతున్నది. స్కూళ్లకు అవసరమైన రిజిస్టర్లు, రికార్డులు, స్టేషనరీ, చాక్‌పీస్‌లు, ప్రయోగశాలల మెటీరియల్‌ను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే సొంత డబ్బుతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీడల నిర్వహణ గ్రాంట్‌ను కూడా విడుదల చేయకుండా ఆటలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యాశాఖ, ప్రభుత్వం పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల చేయాలి. వాటితో రాష్ట్ర అవతరణ దినోత్సవం, బడిబాట, పాఠశాలకు అసరమైన రిజిస్టర్లు, రికార్డులు, టీచింగ్ డైరీలు, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, విద్యార్థులకు నిర్వహించే పరీక్షల సామగ్రి, చాక్‌పీస్‌లు, బోర్డులు, దినపత్రికలు, విద్యుత్ బిల్లు, ఇతర అవసరాలను వెల్లదీయాల్సి ఉంటుంది.
కానీ, ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు, హెచ్ఎంలు సొంత డబ్బులతో బోధన, నిర్వహణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మౌలిక వసతుల మధ్య విద్యా బోధన చేస్తూనే, వారిలో క్రీడా సామర్ధ్యాలను కూడా పెంచాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రీడా నిధులు విడుదలు చేయాలి. వాటిని కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. దాంతో పంద్రాగస్టు నేపథ్యంలో నిర్వహించే క్రీడడా పోటీల ఖర్చులు, బహుమతులు కూడా చేతి నుంచే పెట్టాల్సి వస్తున్నదని పలువురు హెచ్ఎంలు వాపోతున్నారు.
నిధుల మంజూరు ఇలా..
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులను(కాంపోజిట్ గ్రాంట్స్) ప్రభుత్వం విడుదల చేస్తుంది. 1 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటే 10వేల రూపాయలు, 31నుంచి 100 మంది ఉంటే 25వేల రూపాయలు, 101 నుంచి 250 మంది ఉంటే 50వేల రూపాయలు, 251 నుంచి వెయ్యి మంది వరకు ఉంటే 75వేలు రూపాయలను సంవత్సరానికి మంజూరు చేస్తుంది.
అదే విధంగా క్రీడల కోసం ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.10వేలు అందిస్తుంది. ఇప్పుడు విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. స్కూల్ గ్రాంట్స్ మంజూరు ఆలస్యం విషయంలో, జాడలేని క్రీడానిధులతోపాటు ఇతర విషయాలపై మాట్లాడేందుకు కూడా హెచ్ఎంలు, టీచర్లు భయపడుతుండడం గమనార్హం.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలు..
జిల్లా : మండలాలు : పాఠశాలలు
నల్లగొండ : 32 : 1,483
సూర్యాపేట : 23 : 612
యాదాద్రి : 17 : 575
మొత్తం : 72 : 2,670