మునుగోడు, ఆగస్టు 08 : స్థానిక సంస్థల ఎన్నికలు రెండు సంవత్సరాల నుండి నిర్వహించకపోవడంతో గ్రామాల్లో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత రెండు సంవత్సరాల నుండి స్పెషల్ అధికారుల పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు లేక వర్షాలకు వీధులన్నీ గుంతలమయంగా మారడంతో గుంతల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు, ఈగలు చేరి అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలిపారు.
స్పెషల్ అధికారులు గ్రామాలకు వెళ్లకుండా చుట్టపు చూపులా గ్రామాలకు వెళ్తే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా జిల్లా, మండల స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో మండల అభివృద్ధి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, వడ్లమూడి అన్నమయ్య, మేడి రాములు, కట్ట లింగస్వామి, వంటెపాక అయోధ్య పాల్గొన్నారు.