రామగిరి, మే 5 : గతేడాది నవంబర్ 6 నుంచి 18వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేను కేంద్ర ఫ్రభుత్వం ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా చేయడానికి సిద్ధమైందన్నారు.
ఉపాధ్యాయులు శ్రమతో పటిష్టంగా సర్వే నిర్వహిస్తే ఇంత వరకు ప్రభుత్వం సర్వే రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే వేతనం ఇవ్వకపోతే నల్లగొండ జిల్లా నుంచి ప్రత్యేక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడ్త్యా రాజు, ఎడ్ల సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్, రాకేశ్ పాల్గొన్నారు.