నల్లగొండ, డిసెంబర్ 23 : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు కట్టవేస్తూ..రీకౌంటింగ్ పేరుతో అధికారులు చీటింగ్ చేసినా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సత్తా చాటిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్లగొండకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాకతో గులాబీ నేతల్లో నూతనోత్సాహం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా గెలిచిన 230 మంది సర్పంచ్‌లను సన్మానించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ నింపింది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి…గత రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ చేసిన ప్రసంగంతో నూతన సర్పంచ్‌లు కేరింతలు కొడుతూ జై బీఆర్ఎస్..జై కేసీఆర్ అంటూ నినదించారు.
సింగిల్ డిజిట్‌తో బీఆర్ఎస్ సర్పంచ్‌లుగా గెలిచిన ప్రాంతాల్లో రీ కౌంటింగ్ చేపట్టి కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారని ప్రకటించి ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నా, జిల్లాలో అత్యధికంగా దేవరకొండలో 70 స్థానాలు, మిర్యాలగూడలో 41, నాగార్జున సాగర్‌లో 39, నల్లగొండలో 23, మునుగోడులో 28 సర్పంచ్ స్థానాలతో పాటు నకిరేకల్‌లో 28, తుంగతుర్తి నియోజక వర్గ పరిధిలోని శాలిగౌరారంలో ఎనిమిది స్థానాలు మొత్తంగా 230 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రతి ఒక్కరికీ శాలువా కప్పి మెమొంటో అందజేశారు.

పార్టీ గుర్తు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున గెలిచేలా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటేనే సర్కార్ భయపడుతోందన్న ఆయన మాటలకు కార్యకర్తలు మద్దతు పలికారు. ప్రధానంగా ఈ రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసి రైతు భరోసాతో పాటు రుణమాఫీ కూడా ఎగ్గొట్టిందని, రైతులు ఓట్లు వేయరనే ఆలోచనతోనే నామినేషన్ పద్ధతిని ఎంచు కున్నదని కేటీఆర్ అన్న సందర్బంగా రైతులు ఈలలు వేశారు. జడ్పీటీసీలను పెద్ద సంఖ్యలో గెలిపించుకొని చైర్మన్ పదవులు సాధించుకోవాలని సూచించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో పార్టీ కార్యాలయం గులాబీ వనంలా మారింది. కాగా అంతకు ముందు కేటీఆర్ హైదరాబాద్ రోడ్డులో చేపట్టిన ర్యాలీలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి, నిరంజ్ వలీ, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాంచంద్ర నాయక్, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చెరుకు సుధాకర్, కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, మందడి సైదిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నలమోతు సిద్ధార్థ, పాల్వాయి స్రవంతి, బిల్యా నాయక్, బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు.