సూర్యాపేట టౌన్, మార్చి 20 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి బయల్దేరింది మొదలు చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నకిరేకల్, కేతేపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అడుగడుగునా కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్ రోడ్ వద్ద జిల్లా వ్యాప్తంగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం జనగామ క్రాస్ రోడ్ నుంచి ర్యాలీగా కొత్త బస్టాండ్, శంకర్ విలాస్ సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా పార్టీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. సూర్యాపేట పట్టణంలో కేటీఆర్కు పట్టణవాసులు అడుగడుగునా జననీరాజనం పలికారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులకు కేటీఆర్ అభివాదం చేస్తూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి వార్డు నుంచి ముఖ్య నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
KTR : కేటీఆర్కు సూర్యాపేటలో జననిరాజనం.. కధం తొక్కిన బీఆర్ఎస్ దళం