చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేనేత కార్మికుల సమస్యలను గాలికి వదిలేస్తున్నది. నేతన్నలకు ఆసరాగా నిలిచేందుకు బీఆర్ఎస్ సర్కారులో శంకుస్థాపన చేసిన చేనేత హ్యాండ్లూమ్ మోడర్న్ షోరూమ్ నిర్మాణాన్ని అటకెకించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా షోరూమ్ ఊసే ఎత్తకపోవడంతో ప్రశ్నార్ధకంగా మారింది.
కొవిడ్ పరిస్థితులు మొదలు చేనేత రంగం కుదేలైంది. చేతి నిండా పని లేక, చేసిన పనికి సరైన డబ్బులు రాక నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. జౌళి రంగంలో రెడీమేడ్ వస్త్ర ఉత్పత్తి వినియోగం పెరుగడంతో చేతివృత్తులను నమ్ముకొని జీవనం సాగించే చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత చీరల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు ఊతం అందించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలో చేనేత మోడర్న్ సేల్స్ షోరూం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పట్లో రూ.95 లక్షలు కూడా మంజూరు చేసింది. తొలుత 10 శాతం మేర 9.5లక్షలు విడుదల చేస్తూ ప్రొసిడింగ్ ఇచ్చింది. చెకును డిపాజిట్ చేయగా, డబ్బులు బ్యాంకులోనే మూలుగుతున్నాయి.
నిర్మాణాల ప్రారంభం ఎప్పుడో?
2023 జూన్ 6న అప్పటి చేనేత శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా షోరూం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ ప్రక్రియకు అడుగులు పడే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగా, పట్టించుకునేవారు కరువయ్యారు. పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది దాటినా చేనేత మోడర్న్ షోరూమ్ నిర్మాణాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
నేతన్నలకు ఎంతో ఉపయుక్తం..
నేసిన చీరలను అమ్మి.. ఉపాధి పొందేందుకు నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వెంట చేనేత మోడర్న్ సేల్స్ షోరూమ్ ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అప్పటి బీఆర్ఎస్ సరారు యోచించింది. 370 గజాల్లో మూడు షెటర్లు, ఒక గోదాం నిర్మాణానికి నిర్ణయించింది. షోరూం అందుబాటులోకి వస్తే చీరల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ సైతం పనులు ప్రారంభించేందుకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన కరువవుతున్నది. చేనేత మోడర్న్ సేల్స్ షోరూమ్ పనులు ప్రారంభించాలని చేనేత కార్మిక సంఘాలు, సొసైటీలు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండడం లేదు. రాష్ట్ర చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి కూడా వినతి పత్రం అందజేశారు. ఇటీవల జాళి శాఖ కమిషనర్‌ను కూడా కలిసి విన్నవించారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు కేటాయించాలి
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలో జాతీయ రహదారి వెంట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి నిధులు కేటాయించి చేనేత కార్మికులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. కాంప్లెక్స్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి 10శాతం నిధులు కేటాయించారు. భవన నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నాం. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు విడుదల చేస్తే షాపింగ్ కాంప్లెక్స్ పూర్తవుతుంది. దాంతో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.
– గడ్డం జయశంకర్, కొయ్యలగూడెం చేనేత సహకారం సంఘం ఇన్చార్జి చైర్మన్