సూర్యాపేట టౌన్, మార్చి 18 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే పార్టీ భారీ బహిరంగ సభతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు.
వరంగల్ సభ విజయవంతానికి కేటీఆర్ సూర్యాపేటలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారని, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.