భువనగిరి అర్బన్, డిసెంబర్ 17 : యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భువనగిరి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డితో కలిసి బుధవారం స్థల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ జిల్లాలో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సమావేశంలో ముఖ్యఅతిథి కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాల న్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుకుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.