ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటికీ ప్రతీ ఎకరాకూ అందుతున్న సాగు నీరు కాంగ్రెస్ ప్రభుత్వ చలువేనట! కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లు పారలేదు అట!! నీళ్లు పారినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసి… రాజకీయాలు బంద్ చేసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు మాట్లాడడంపై నల్లగొండ జిల్లా రైతులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కలు… వివిధ శాఖల గణాంకాలు… కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించిన వివరాల ప్రకారం కూడా కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి అసత్యాల నేపధ్యంలో ఉమ్మడి జిల్లాలో 2014కు ముందు కాంగ్రెస్ పాలనలోని పరిస్థితిని… గత పదేండ్లల్లో కేసీఆర్ హయాంలో జరిగిన విప్లవాత్మక మార్పులను తేటతెల్లం చేసే కథనమిది.
– నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
సమైక్య రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు ఖిల్లాగా ముద్రపడింది. అన్ని అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరు లేక పంటలు పండక, భూములు పడావు పడి వలసల జిల్లాగా ఉంది. నాగార్జునసాగర్ ఆయకట్టు మినహాయిస్తే అంతా సాగునీటికి బోరుబావులే ఆధారం. పాతాళంలోని భూగర్భజలాలకు తోడు వచ్చీరాని కరెంటుతో మొదటి మడి తడవడమే కష్టమయ్యేది. ఇలా రైతన్న గోస చెప్పనలవిగా ఉండేది. రైతులు భూములు వదిలి పట్నం వలస బాట పట్టగా లక్షలాది ఎకరాలకు బీళ్లుగా మిగిలాయి. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నల్లగొండ రైతన్న సగర్వంగా తలెత్తుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాడు.
బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలే మారిపోయాయి. ఏడాదికేడాదికి వ్యవసాయంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం సాధించిన తొలి ఏడాదే నాగార్జునసాగర్ ఆయకట్టుకు కృష్ణా జలాల్లో నిక్కచ్చిగా నీటి వాటా అందిస్తూ రెండు పంటలకు సాగునీరు అందించారు. కృష్ణా జలాలకు కొద్దికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తోడయ్యాయి. మిషన్ కాకతీయతో చిన్న నీటి వనరులను పటిష్టపర్చడంతో భూగర్భజలాలు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి.
వీటన్నింటికి తోడు 2018 నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా అతిపెద్ద మార్పునకు బాటలు వేసింది. సాగు బడిలో రైతన్నకు ధైర్యమిస్తూ రైతుబంధు తోడైంది. ఇవన్నీ వెరసి నల్లగొండ రైతుల స్థితిగతులనే మార్చేశాయి. ముఖ్యంగా వరి సాగులో నల్లగొండ రైతులు దేశం దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరారు. దేశంలోనే అతి ఎక్కువ వ రి పండిస్తున్న జిల్లాగా నల్లగొండ అగ్రగామి గా నిలిచింది. 13.54లక్షల ఎకరాలకు వరి సాగు విస్తీర్ణం పెరిగితే 34 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం పండించి రాష్ర్టానికే తలమానికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నిలిచింది.
పదేండ్ల కేసీఆర్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి సాగు అమాంతం 305 శాతం పెరిగితే… సాగైన ప్రతి గుంటకూ సాగునీరు అందడం విశేషం. 2014 నుంచి 2023 వరకు వరి సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే… కేసీఆర్ హయాంలోని తొమ్మిదిన్నరేండ్లల్లో అదనంగా 9.10లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు స్పష్టం చేశాయి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చివరి నాటికి 2014 వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో వరి సాగు కేవలం 4.44లక్షల ఎకరాల్లోనే ఉండేది. అలాంటిది కేసీఆర్ హయాంలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ… 2023 వానకాలంలో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం 13.54లక్షల ఎకరాలకు విస్తరించింది. వరి సాగులో రాష్ట్రంలోనే నల్లగొండ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా నలువైపులా సాగునీటి వనరులు విస్తృతంగా అందుబాటులోకి రావడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. స్వరాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతో పాటు ఏఎమ్మార్పీ లో లెవల్, హై లెవల్ కాల్వల ద్వారా సమృద్ధిగా కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చాయి. మూసీ ద్వారా అదనపు జలాలు, చెరువులు, కుంటల ద్వారా భూగర్భజలాలు అందాయి. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలోని ఎడమ కాల్వ ఎగువ భాగం, ఆలే రు, భువనగిరిలోని మెజార్టీ ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు కేసీఆర్ హయాంలో అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటి ఫలితంగా ఉమ్మడి జిల్లా దేశంలోనే అగ్రగామిగా రూపుదిద్దుకుంది.
ఉమ్మడి జిల్లాలో ఈ పదేండ్ల కాలంలో సాగు నీటి వనరులు ఊహకందని రీతిలో పెరగడంతోపాటు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం లభిస్తుండడంతో పంటల సాగు విస్తీర్ణం ఊహించని రీతిలో పెరిగింది. పదేండ్లల్లో అన్ని పంటల సాగు రెట్టింపైంది. ఉమ్మడి జిల్లాలో 35.10 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో 2014 నాటికి అప్పటి కాంగ్రెస్ పాలనలో అన్ని పంటలు కలిపి మొత్తం సాగు విస్తీర్ణం 13.12 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 2023 చివరకు వచ్చే సరికి అది రెట్టింపును దాటి 26.50లక్షల ఎకరాలకు చేరుకుంది. ప్రధానంగా వరి సాగు విస్తర్ణమే 9.10లక్షల ఎకరాల్లో పెరిగింది. మిగతా అన్ని పంటలు కలిపి మరో నాలుగు లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే 60 ఏండ్ల సమైక్య పాలనలో 13.12లక్షల ఎకరాలే సాగులోకి వస్తే… కేవలం కేసీఆర్ పదేండ్ల కాలంలో 13.38లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చినట్లు స్పష్టమవుతున్నది.
స్వరాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ సంపూర్ణ తోడ్పాటుతో సమైక్య పాలనలో సాగును వదిలి వెళ్లిన వారంతా తిరిగి సాగుపై దృష్టి సారించారు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. కేసీఆర్ హయాంలో ఏటికేడు పంటల సాగు, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతూ వచ్చింది. అందుకే దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా అగ్రస్థానానికి ఎదిగింది. వాటన్నింటినీ కాదంటూ కేవలం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పెద్దలు, మంత్రులు అసత్య ప్రచారానికి తెరలేపారు. అసలు నల్లగొండకు కొత్తగా నీళ్లే ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. నీళ్లు ఇవ్వకపోతే కేవలం నీళ్లపై ఆధారపడి పండే వరి సాగు ఏకంగా 9.10లక్షలకు ఎలా పెరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. శనివారం అసెంబ్లీలో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు చేసిన సవాల్‌కు సిద్ధ్దపడి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూర్యాపేట జిల్లా భూములను సందర్శించగలరా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్పత్తి విషయానికి వస్తే.. 2014 వానకాలంలో 12.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనాకు గానూ వచ్చిరానీ కరెంటుకుతోడు భూగర్భజలాలు సరిగ్గా లేక 7.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే రైతుల చేతికి వచ్చింది. ఇందులో స్థానిక అవసరాలకు పోనూ కేవలం 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ 2023 యాసంగి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 13.54లక్షల ఎకరాల్లో వరి సాగవగా ఒక్క గుంట కూడా పంట ఎండకుండా పంట చేతికొచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 33.85లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా స్థానిక అవసరాలు పోనూ 12.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయడం విశేషం. అందుకుగానూ రైతులకు అందిన మద్దతు ధర రూ.2,255 కోట్లు నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమైంది.
వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతుబంధు పెట్టాం. 24గంటల నాణ్యమైన నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చాం. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి నీళ్లు ఇవ్వాలన్న ఎజెండాతో పని చేశాం. అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. పదేండ్లలో రైతుబంధు మాత్రమే కాదూ.. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు వేదికలు సమకూర్చాం. వ్యవసాయ స్థిరీకరణ జరుగాలన్న లక్ష్యంతో పని చేశాం. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టకుండా 30 వేల కోట్లను వదులుకున్నాం. ఇది మా కేసీఆర్ కమిట్మెంట్.
– మాజీ మంత్రి కేటీఆర్
లాస్ట్ పదేండ్లల్లో నల్లగొండ జిల్లాలో ఒక్క ఎకరాకైనా కొత్తగా ఇరిగేషన్ వాటర్ వచ్చిందా? నల్లగొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండిందంటే అది ఆనాటి సాగర్ డ్యామ్, ఏఎమ్మార్పీతో వచ్చిన పంటే. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదు. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు పదేండ్లల్లో నీళ్లు ఇచ్చినట్లు రుజువు చేస్తే… అందరం కలిసి వెళ్దాం.. రాజీనామా చేసి… రాజకీయాలు బంద్ చేసుకుంటా.
-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వెంకట్‌రెడ్డి గారూ… నల్లగొండ జిల్లాకు అన్యాయం అయ్యిందన్నారు.. సభ అయ్యాక మనం ఇద్దరం సూర్యాపేట, తుంగుతుర్తి, కోదాడ ప్రాంతాలకు పోదాం. 2 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయా.. లేదా.. కాల్వల మీద నడుస్తూ రైతులను అడుగుదాం. నీళ్లే కాదూ.. నల్లగొండకు ఎన్నో ఇచ్చాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చాం. నల్లగొండ పట్టణాన్ని కేసీఆర్ హయాంలో ఎలా తీర్చిదిద్దామో అక్కడి ప్రజలే చెప్తారు.
– మాజీ మంత్రి హరీశ్‌రావు