నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్25(నమస్తే తెలంగాణ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలు, మంత్రుల వ్యవహార శైలి, అవినీతి, అరాచకాలు, ప్రజల్లో వ్యతిరేకతపై పోరాటాలతోపాటు బీఆర్ఎస్ కేడర్‌లో జోష్ నింపే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజల్లో జరుగుతున్న చర్చ, వ్యతిరేకత, పార్టీ పరిస్థితి, చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపైనా విస్తృతంగా చర్చించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా ముఖ్య నేతలంతా తాజా పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో తిరిగి మళ్లీ ఫ్లోరైడ్ ఆనవాళ్లు తెరపైకి వచ్చాయని కేటీఆర్‌కు వివరించారు. జిల్లాలో కాంగ్రెస్ నేతల అవినీతి, అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నదని, ముఖ్యంగా మంత్రుల సపోర్ట్‌తో అధికార పార్టీ నేతలు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో నియోజకవర్గాల వారీగా వివరించారు. జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో ప్రజల్లోనూ వ్యతిరేకత మొదలైందని చెప్పారు.
జిల్లా నేతల నుంచి వివరాల సేకరణ అనంతరం కేటీఆర్ స్పందిస్తూ మంత్రుల అవినీతి, అరాచకాలను ఎండగడుదామని పిలుపునిచ్చారు. అధికార దర్పం, అహంకారంతో మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు విమర్శించారు. మంత్రులతోపాటు కాంగ్రెస్ నేతల అక్రమాలను, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు జిల్లాకు సంబంధించిన స్థానిక అంశాలపైనా మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం కావాలని కేటీఆర్ సూచించారు. ఇంకా జిల్లా పరిధిలో ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపైనా పార్టీ నేతలతో కేటీఆర్ చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై త్వరలోనే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు వివరిద్దామని నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలతో కేటీఆర్ విసృ్తతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ముందుకు తీసుకువెళ్లాల్సిన అంశాలపైనా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్‌కు భరోసానిస్తూ మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రానున్న కాలంలో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత రావడం ఖాయమని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణను సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, నల్లమోతు భాసర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ జడ్పీ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సోమ భరత్‌కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.