మునుగోడు, మే 02 : చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలకు కృష్ణా జలాలు అందించడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై శుక్రవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని లక్ష్మాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు కొనసాగింపుగా నారాయణపూర్, చౌటుప్పల్ మండలాలకు నీరందించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సభ్యులు, ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.
చౌటుప్పల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభాకు సరిపడా తాగునీరు అందించడంతో పాటు, నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల్లోని చెరువులు, కుంటలను నింపి భూగర్భ జలాలను రీఛార్జి చేసే విధంగా శివన్నగూడెం రిజర్వాయర్ నుండి నీటిని తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ రెండు మండలాలకు నీటిని తీసుకొచ్చే విషయంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సభ్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు, చేపట్టాల్సిన పనులపై సమీక్షలో చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సభ్యులు శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చంద్రమౌళి, సత్తిరెడ్డితో పాటు, గట్టుప్పల్ డీఈ సురేందర్ రెడ్డి, గట్టుప్పల్ ఏఈ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.