కొండమల్లేపల్లి, జనవరి 29 : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు నెల రోజులుగా వెలగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ నుంచి జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పట్టణంలోని చౌరస్తా నుంచి కోల్ముంతల్పహాడ్ వరకు రోడ్డును వెడల్పు చేశారు. డివైడర్ల మధ్యలో బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేశారు. లైట్లు ప్రారంభించి నాలుగు నెలలు అవుతున్నా ఏనాడూ సక్రమంగా వెలుగలేదు. నెల రోజులుగా దేవరకొండ రోడ్డు చౌరస్తా నుంచి తాసీల్దార్ కార్యాలయం వరకు లైట్లు వెలుగడం లేదు. దాంతో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంటున్నది. చీకట్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే లైట్ల నిర్వహణ విషయంలో ఎన్హెచ్ఏఐ, గ్రామపంచాయతీ అధికారులు మధ్య సమన్వయలోపంతో వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు.
రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలుగడం లేదనే విషయం ఇటీవల నా దృష్టికి వచ్చింది. అధికలోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్ తరుచూ కాలిపోవడం, తరుచు ఆన్ఆఫ్ చేసే క్రమంలో ఫీజు కాలిపోయి లైట్లు వెలుగడం లేదు. వాటి బాధ్యత చూసే కాంట్రాక్టర్ అందుబాటులో లేక జాప్యం జరిగింది. వెంటనే మరమ్మతులు చెయించి లైట్లు వెలిగేలా చూస్తాం.