మిర్యాలగూడ టౌన్, నవంబర్ 17: త్వరలో నిర్వహించనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి వద్ద రూ.74 కోట్లతో చేపట్టనున్న శెట్టిపాలెం-అవంతీపురం నాలుగు లేన్ల రహదారి పనులను ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..అభివృద్ధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
మిర్యాలగూడ పట్టణంలో, మండలంలో రూ.250 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టి మిర్యాలగూడను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పెండింగ్ ఉన్న మూడు ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ పనులను 10, 15 రోజుల్లో ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతా ల్లో జమ చేస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎత్తిపోతల పథకాలు త్వరగా పూర్తి చేసి రైతుల అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మిర్యాలగూడ పట్టణంలో రూ.75.25 కోట్లతో రోడ్డు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మించిన కళాశాల భవనాన్ని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీవో శేషగిరి శర్మ, నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, జొన్నలగడ్డ శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, పొదిల శ్రీనివాస్ పాల్గొన్నారు.