చండూరు, జూన్ 08 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అత్యంత చరిష్మా కలిగిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి వర్గ విస్తరణలో పదవి ఇవ్వకపోవడంతో తాను మనస్థాపన చెందానని తెలిపారు. గతంలో బిజెపి పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మీలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవసరమని, మంత్రి పదవి ఇస్తామని నచ్చజెప్పి పార్టీలో చేర్పించుకున్నారని అన్నారు.
అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి సామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవడన్న సమాచారం ఉంనందున రాజగోపాల్ రెడ్డికి మీరు భువనగిరి అభ్యర్థిని గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చెప్పిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రాజన్నకు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇవ్వకుండా వెనుకబడిన మునుగోడు ప్రాంతం ఇంకా వెనుకకు నెట్టి వేయబడుతుందని, ఇంకా ఎప్పుడు మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందదని, తను మనస్థాపనతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.