కోదాడ, జనవరి 05 : మున్సిపాలిటీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కోదాడ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సోమవారం తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతూ ఆయన మున్సిపల్ మేనేజర్ రాబిన్‌కు వినతిపత్రం అందజేశారు. 15 సంవత్సరాలుగా మున్సిపాలిటీ పరిధిలో నివసించని వారి పేర్లు, గడచిన ఐదు సంవత్సరాల్లో చనిపోయిన వారి పేర్లు కూడా ఈ ఓటరు జాబితాలో పొందుపరిచారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బూత్ స్థాయి అధికారుల అసమర్ధత కారణంగా కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డులకు సంబంధించి ఓటర్ల జాబితాలో ఓటర్ల జంపింగ్ బోర్డర్ లైన్ క్రాస్ చేస్తూ ఒక వార్డులో ఉన్న ఓట్లు మరో వార్డులో చేర్చారన్నారు. తప్పులను సవరించి కొత్త జాబితాను విడుదల చేయాలని ఆయన కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య గౌడ్, చీమ శ్రీనివాసరావు, బొజ్జ గోపి, కుడుముల సైదులు, గుండె రాజేష్, గడ్డం యేసు ఉన్నారు.