నేరేడుచర్ల, ఏప్రిల్ 3: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలగాణపై విషం చిమ్ముతూ రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉందని చెప్పడం అబద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లు 2014 ఫిబ్రవరి 10న రాజ్యసభ ఆమోదం పొందిందన్నారు. 2014 మార్చి 30న రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ 63 సీట్లు సాధించిందన్నారు.
ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని విజయం సాధించారని గుర్తు చేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ‘2024 మే 26న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి మోదీతో లాలూచీపడి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని లేకుంటే చేయనని షరతు పెట్టారు. చంద్రబాబు మాటాలకు తలొగ్గిన మోదీ ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 2024 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు.
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయాలని కుట్రలో భాగంగానే 2014 మే 29న విలీనం ఆర్డినెన్స్ తీసువచ్చారు’ అని చెప్పారు. ఈ ఆర్డినెన్స్ రాగానే కేసీఆర్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఏడు మండలాలు ఆంధ్రలో విలీనమైన తరువాతనే 2014 ఫిబ్రవరి 8న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే కిషన్రెడ్డి మాత్రం ఏడు మండలాల విలీనం రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఉందని, కేసీఆర్ అనుమతితోనే జరిగిందని రాజ్యసభలో పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభలో కిషన్రెడ్డి మాటాలను భేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెంగాణ మేధావులు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.