నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్3(నమస్తే తెలంగాణ) : నాంపల్లి మండలం గానుగుపల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ దందాలో కీలక నిందితుడిని నల్లగొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చండూరుకు చెందిన ఇద్దరు, కనగల్ మండలం ఎడవెల్లికి చెందిన ఒకరు, నాంపల్లికి చెందిన మరొకరు పోలీసులు అదుపులో ఉన్న విషయం తెలిసిందే. వారిచ్చిన సమాచారంతో నకిలీ మద్యం తయారీ దందాలో విజయవాడకు చెందిన వ్యక్తి కీలకమని గుర్తించి అతడిని బుధవారం రాత్రి ప్రత్యేక పోలీసు బృందాలతో వెళ్లి పట్టుకున్నట్లు తెలిసింది.
గురువారమంతా కీలక నిందితుడితోపాటు మిగతా నలుగురి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లు వెల్లడించిన వివరాలతో దాదాపు ఈ కేసు కొలిక్కి వచ్చిందని తెలుస్తున్నది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో కలకలం రేపిన నకిలీ మద్యం తయారీ దందాపై మంగళవారం నుంచి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో దృష్టి సారించిన విషయం తెలిసిందే.
బుధవారం జి.ఎడవెల్లికి చెందిన భార్గవ్‌తోపాటు చండూరుకు చెందిన పండ్ల వ్యాపారి ఎర్రజెల్ల రమేశ్, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిచ్చిన సమాచారం మేరకు ఇక్కడ నకిలీ మద్యం తయారీకి పురమాయించిన అసలు నిందితుడు విజయవాడకు చెందిన వ్యక్తిగా తేలింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకోవడంతో మొత్తం దందా సాగుతున్న వైనం వెలుగు చూసింది.
విజయవాడకు చెందిన వ్యక్తి నాంపల్లి మండలం గానుగుపల్లి కేంద్రంగా రమేశ్‌తో ఒప్పందం చేసుకుని నకిలీ మద్యం తయారీకి ఒప్పందం చేసుకున్నాడు. మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, ఫ్లేవర్స్, ఇతర సామగ్రి, డ్రమ్ములు, క్యాన్లు, ఖరీదైన లేబుల్స్‌తో కూడిన ఖాళీ బాటిల్స్‌ను సైతం అతడే రమేశ్‌తోపాటు మిగతా నిందితులకు సరఫరా చేసేవాడని తెలిసింది. ఇక్కడ మద్యాన్ని తయారు చేశాక దాన్ని తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు మరికొందరితో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.
ఇక్కడ తయారైన నకిలీ మద్యాన్ని స్థానికంగా కొంతమేర విక్రయించడంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఎక్కువ మొత్తంలో అమ్మి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. ముఖ్యంగా ఫంక్షన్లల్లో మందు పార్టీలకు, సిట్టింగ్‌లకు పెద్ద మొత్తంలో సరఫరా చేసేవారని తెలుస్తున్నది. దాంతోపాటు ఎన్నేండ్లుగా దందా సాగుతుంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎక్కడెక్కడికి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు వంటి విషయాలపై పోలీసులు దృష్టి సారించి విచారణ ముమ్మరం చేశారు.
గురువారం సాయంత్రం వరకు కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎస్పీనే స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో కేసులో దర్యాప్తులో ఉన్న కింది స్థాయి అధికారులెవరూ నోరు మెదపడం లేదు. ఇదే సమయంలో గురువారం నాంపల్లి పోలీసు స్టేషన్లో ఎర్రజెల్ల రమేశ్ అండ్ అదర్స్ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 34(ఏ) 37(ఏ)కింద కేసు నమోదు చేయడంతోపాటు గానుగుపల్లి వ్యవసాయ క్షేత్రంలో గుర్తించిన డ్రమ్ములు, క్యాన్లు, స్పిరిట్, ఇతర సామగ్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించే సమయంలో వాటిని చూపించే అవకాశం ఉంది.