కేతేపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో ని బొప్పారం గ్రామంలో రూ.10.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మా ట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లెప్రగతిని ప్రవేశపెట్టిందన్నారు. పేద ప్రజల కొసం సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి పధకాలు ప్రవేశపెట్టారన్నారు. దళితులకు సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు దళితబంధు పధకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఏడేండ్లలో అభివృద్ధికి దారులు వేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను శక్తివంచన లేకుండా దశలవారీగా అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం కాసనగోడుకు చెందిన చామల హేమలతకు రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఎల్వోసీ పత్రాలు, మేడిపల్లి మహేశ్‌కు రూ.32 వేల సీఎం రిలీఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.