దేవరకొండ రూరల్, డిసెంబర్ 08 : గత పదేండ్ల కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బీఆర్ఎస్ సానుభూతిపరులను, కేసీఆర్ అభిమానులను ఏకం చేయాలన్నారు.
రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రమావత్ నర్సింహ, రమావత్ కిస్టు, మాజీ సర్పంచ్ సత్తయ్య, కొండల్, మడెం ఇద్దయ్య, విక్కి పాల్గొన్నారు.