సూర్యాపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సమయంలోనైనా… తదనంతరం పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట నుంచే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు నీళ్ల కోసం 2002లో కోదాడ నుంచి నాగార్జునసాగర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కాలనే కుట్రలకు తెరలేపి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను లాక్కున్న నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కోరిక లేదంటుండగా 2006లో పల్లెబాట కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారు.
అది ఉద్యమం నాటి నుంచి అత్యంత సన్నిహితంగా మెలిగి ఆసాంతం ఆయనతోనే పయనిస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సొంత ఊరు అయిన నాగారం నుంచి మొదలు పెట్టారు. అనంతరం తెలంగాణ ప్రాంతంలో పర్యటించి ఉద్యమం లేదనేదానికి సమాధానం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం విదితమే. కాగా జీవితకాలం మరచిపోలేని సదరు సంక్షేమ పథకాలను నాటి ఉద్యమ సమయంలో 2012లో సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ సమర భేరి సభ సాక్షిగా ప్రకటించడం గమనార్హం.
ప్రభుత్వం వైపు దీనంగా ఎదురు చూస్తున్న అభాగ్యులకు రూ.2వేల పింఛన్ ఇస్తానని సూర్యాపేట నుంచే ప్రకటించగా కొత్త జిల్లాల ఏర్పాటును సైతం సూర్యాపేట సమరభేరి నుంచే చెప్పారు. అంతే కాకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరా ఇలా గత బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలతోపాటు చేయబోయే అభివృద్ధిని సూర్యాపేట నుంచే ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలోనే మొదటగా సూర్యాపేట గొల్లబజారులో నాటి మంత్రి జగదీశ్‌రెడ్డి తలపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హాజరై శంకుస్థాపన చేశారు. సూర్యాపేటపై ఇంతటి అభిమానం చాటిన కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని నేడు పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.