కోదాడ, జూన్ 21 : అన్నదాతలను రాజును చేసేందుకు కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం, పార్టీ సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యంబాబు అన్నారు. కాలేశ్వరం భారీ ఎత్తిపోతల పథకం ఆవిష్కరించబడి ఆరు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కోదాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని కొనియాడారు. గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఒడిసిపట్టి రాష్ట్రంలోని బీడు భూములకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.
ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రపంచ వ్యాప్తంగా హర్షిస్తుంటే, అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం శోచనీయమన్నారు.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యాయని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేదర లలిత, పిట్టల భాగ్యమ్మ, కర్ల సుందర్ బాబు, అలవాల వెంకట్, చింతల నాగేశ్వరరావు, ఉపేందర్ గౌడ్, అబూబకర్, శ్రీనివాసరావు, నరసయ్య, షాకీర్, గంధం శీను, కుడుమల సైదులు, క్రాంతి, ఖాసిం, యేసు పాల్గొన్నారు.