యాదాద్రి భువనగిరి, జవవరి 4 (నమస్తే తెలంగాణ) : కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. నీటిని నిల్వ చేయాలంటే బీఎన్ తిమ్మాపూర్ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించాల్సి ఉన్నది. ఈ క్రమంలో తమ భూములకు నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తేనే ఖాళీ చేస్తామని ఆ గ్రామస్తులు పట్టుబడుతున్నారు. నిర్వాసితుల కోసం రూ.150 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. అవి వస్తేనే మిగతా పనులు వేగవంతం కానున్నాయి.
కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ నిధులను విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఇటీవల ప్రజా భవన్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సైతం అందించారు. కాగా, 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 2.50లక్షల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో జిల్లాలో బస్వాపూర్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1652.26 కోట్లు కేటాయించింది.
ఇప్పటి వరకు రూ.1557.69 కోట్ల పనులు పూర్తయ్యాయి. మొత్తం జలాశయం, ఎగువ, దిగువ కాల్వలు నిర్మించేందుకు 5,891 ఎకరాల భూసేకరణ చేపట్టారు. బస్వాపూర్‌లోని నీటిని దిగువ భాగానికి మళ్లించేందుకు ప్రధాన కాల్వతోపాటు ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్, మైనర్, సబ్ మైనర్ కాల్వలను నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్ కాల్వలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా ఆయా ప్రాంతాలకు సాగు నీరు అందేలా మైనర్లు, సబ్ మైనర్లు, క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు.
రిజర్వాయర్ నిర్మాణంతో బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయక్‌తండా, చొంగల్నాయక్తండా పూర్తిగా మునిగిపోతున్నాయి. అందుకోసం సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేను పూర్తి చేశారు. బీఎన్ తిమ్మాపూర్‌లో మొత్తం 585 ఇండ్లకు సంబంధించి పరిహారం చెల్లించాల్సి ఉంది. గ్రామాన్ని ఖాళీ చేయాలంటే నిర్వాసితులకు పరిహారం జమ చేయాలి. అప్పుడే తాము ఖాళీ చేస్తామని బాధితులు చెబుతున్నారు. ఇందుకోసం రూ.95 కోట్లు, వేరే ప్రాంతంలో పునరావాసం కల్పించేందుందుకు రూ.45 కోట్లు కావాలి. మొత్తంగా సుమారు 140 కోట్లు అవసరమవుతాయని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో అది పెండింగ్ పడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ నిధులను విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఇటీవల ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
బస్వాపూర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తయ్యాయి. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్తండాకు ప్యాకేజీ పూర్తయ్యింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.7.60 లక్షలను ప్రభుత్వం అందించింది. ఇంట్లో మేజర్ పిల్లలు ఉన్నా.. వారికి కూడా ప్యాకేజీ వర్తింపజేసింది. బీఎన్ తిమ్మాపూర్‌లో మొదటి విడుతలో రూ.50 కోట్లతో 655 మందికి, రెండో విడుతలో 401మందికి రూ.33 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. పునరావాసం కింద ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు భువనగిరి మండలం హుస్నాబాద్‌లో సర్వే నంబర్ 107లో 1,056 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 200 గజాలు ఇచ్చారు.
నృసింహసాగర్ రిజర్వాయర్‌తో యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాలు సస్యశ్యామలం కానున్నాయి. సాగునీటితోపాటు తాగునీరు కూడా అందనున్నది. జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజవర్గాలతోపాటు మోత్కూరు, నల్లగొండ జిల్లాలోని రామన్నపేట, చిట్యాల, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలాలకు సాగునీరు అందనున్నది. మరోవైపు నృసింహ రిజర్వాయర్ ప్రాంతం పర్యాటకంగా కూడా ప్రఖ్యాతిగాంచనున్నది. ఇక్కడ బోటింగ్, పార్కులు, మ్యూజికల్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రణాళికలు చేశారు.