– న్యాయం జరిగేంత వరకు దళిత ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 21 : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ప్రోద్బలంతోనే దళిత బిడ్డ రాజేశ్ దుర్మరణం చెందాడని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కర్ల రాజేశ్ మృతిపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా బలి చేసేందుకు ఉత్తమ్ దంపతుల ఆదేశాలతోనే అమాయకుడైన దళిత బిడ్డ కర్ల రాజేశ్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారన్నారు. రాష్ట్రంలో ఒకవైపు పలు రంగాల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నా, కోదాడలో పలు మాఫియాలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం కేవలం సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి కర్ల రాజేశ్‌ను లక్ష్యంగా చేసుకుని చిత్రహింసలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే తన పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉత్తమ్ దంపతుల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దళిత, బహుజన యువకులను వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. రాజేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు రప్పించి తన పేరు చెప్పాలని బలవంతం చేశారని, అలా చెప్పకపోవడంతో చిత్రహింసలకు గురిచేసి ఉసురుతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్ మరణం తనను కలచివేసిందన్నారు. ఈ దుర్ఘటనకు రాజకీయ రంగు పులమ వద్దని, మనసులో బాధ ఉన్నప్పటికీ రాజేశ్ అంత్యక్రియలో పాల్గొనలేదని, ఆ కుటుంబాన్ని పరామర్శించ లేదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాదిగ జాతిపిత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాజేశ్ మరణానికి పోలీసులే కారణమని ఆధారాలతో సహా రుజువు చేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
అసలు దోషి ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతుంది ఉత్తమ దంపతులేనన్నారు. రెండు దశాబ్దాలుగా కోదాడ నియోజకవర్గంలో రాజకీయంగా తనను అణగదొక్కేందుకు ఉత్తమ్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇలాంటి చిల్లర చర్యలకు పూనుకున్నారన్నారు. రాజకీయాలలో కోట్లాది రూపాయలు నష్టపోయిన తాను రూ.12 లక్షల కోసం ఆశ పడతానంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మందకృష్ణ మాదిగ, దళిత సంఘాలు ఏ పిలుపు ఇచ్చిన తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మందకృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, అఖిలపక్ష నాయకులు మేకల శ్రీనివాసరావు, వంగవీటి శ్రీనివాసరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.