నీలగిరి, జనవరి 28 : కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ.వి.ఎల్.నరసింహ రావు @కన్నారావు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన గడిచిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్లో చేరారు. కిందటి శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే తాజాగా జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు ఉద్యమ నాయకులు తిరిగి బీఆర్ఎస్ లో చేరాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు తిరిగి ఆయన సొంత గూటికి చేరారు.
బుధవారం ఉదయం నల్లగొండ పట్టణంలోని 41వ వార్డు ఇన్చార్జి యాట జయప్రద రాంరెడ్డి ఆధ్వర్యంలో కన్నారావుకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బండ నరేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకులు అందరూ తిరిగి బీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. కన్నారావు వెంట పార్టీలో చేరిన వారిలో చకిలం యాదగిరి రావు, శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత కాంచనపల్లి రవీందర్ రావు, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు.