– సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
హుజూర్నగర్, జనవరి 13 : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్దం నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం విషయంలో అలాగే వర్సిటీలో ఉద్యోగాల కల్పనలో అన్ని విధాల న్యాయం చేస్తామని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ కలెక్టర్ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. అగ్రికల్చర్ యూనివర్సిటీలో అర్హతలు మేరకు భూములు కోల్పోయిన కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే ఈ ప్రాంతానికి స్మశాన వాటిక మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టకి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు హామీ ఇచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మించడం ద్వారా రైతులకు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం వచ్చేలా అధునాతన వ్యవసాయం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించవచ్చన్నారు. అలాగే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం అక్కడే ఉన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, కంపాక్స్ బాక్స్ లు అందజేసి బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, డీటీ నాగేందర్, రైతులు పాల్గొన్నారు.