నీలగిరి, జూన్ 24 : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నారని, తమకు రావాల్సిన ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వడం లేదని సోమవారం ప్రభుత్వ మెడికల్ కళాశాల అవరణలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపివేశారు. ఎమర్జెన్సీ సేవలు, పరీక్షల్లో ఉన్న జూడాలు మినహా మిగిలిన సుమారు మూడు వందల మందికి పైగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. జూడాల సమ్మెతో ఓపీకి వచ్చిన రోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు వెనుదిరిగారు.
ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ మెడికల్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని పలు రకాలుగా నిరసనలు తెలిపినా స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు. గ్రీన్ చానల్లో జూనియర్ డాక్టర్ల (హౌస్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, సీనియర్ రెసిడెంట్ల) స్టైంఫండ్ను సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూనియర్ డాక్టర్లందరికీ ప్రతి నెలా 10వ తేదీలోపు ైస్టెఫండ్ జమ చేయాలని కోరారు. ైస్టెఫండ్ను సకాలంలో విడుదల చేయడం కోసం గ్రీన్ చానల్ నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రవాణా కోసం కొత్త బస్సుల సేకరణతోపాటు ఆసుపత్రిలో నీటి సౌకర్యం కల్పించాలన్నారు.
కళాశాలలో మూసివేసిన లైబ్రరీని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నుంచి సాలర్షిప్ అందలేదని, క్యాజువాలిటీలో ఇంటర్న్ రూమ్స్, వాష్రూమ్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం మందులు కూడా అందుబాటులో ఉంచడం లేదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే అబ్దుల్ సమద్, గగన్ పెరుమాండ్ల, ఉపాధ్యక్షులు రుత్విక్, సత్యసాయి కృష్ణ, రేవంత్, జాహ్నవి, జాయింట్ సెక్రటరీలు బాలు వేమిరెడ్డి, షేక్ షాబాజ్, హరీశ్, దీపిక, కోశాధికారి ఇంద్రాణి పాల్గొన్నారు.