నల్లగొండ : నిత్యం పేదల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించిన సిపిఎం నల్గొండ డివిజన్ నాయకులు కాజీరామారం మాజీ సర్పంచ్ కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య చూపిన దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు ఎస్టీ కాలనీ రైతు వేదిక దగ్గర మాజీ సర్పంచ్ కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య- లింగమ్మ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని అన్నారు.
ఒక విధానం లేకుండా పూటకో పార్టీ మారి భూస్వాములకు , కార్పొరేట్లకు వంత పాడుతున్న కాంగ్రెస్, బిజెపి, పార్టీలను ప్రజలు తిరస్కరించాలని, ఓట్లను నోట్ల ద్వారా కొనాలని దుర్బుద్ధి కలిగిన వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజన నిరుపేద కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ రుద్రాక్షి యర్రయ్య కమ్యూనిస్టుగా ప్రజలలో నిరంతరం పనిచేసిన నాయకుడని కొనియాడారు. కాగా, పానగల్లు కత్వ నుండి రామారం వరకు ఉన్న రోడ్డుకు రుద్రాక్ష యర్రయ్య మార్గం అని నామకరణం చేయాలని , 3వ వార్డు ఎస్టీ కాలనీకి రుద్రాక్ష యర్రయ్య నగర్ గా పేరు మార్చాలని అన్ని పార్టీల నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.