చండూరు సెప్టెంబర్ 26: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని నెర్మట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంస పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడిచిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో స్థానిక సమస్యల పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
నెర్మట నుండి బంగారిగడ్డ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని, ఈ రోడ్డు వెంట రైతులు నడవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చుట్టుపక్కల గ్రామాలైన పుల్లెంల, శేరిగూడెం, బంగారరి గడ్డ, లెంకలపల్లి ఈ రోడ్డు మరమ్మతు పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి వాటిపై పోరాటాలు నిర్వహించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రజా పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి, సిపిఎం గ్రామ శాఖ కమిటీ సభ్యులు కొత్తపల్లి లక్ష్మమ్మ, బొమ్మరగోని యాదయ్య, శంకరయ్య, వెంకన్న, స్వామి, నరసింహ,తదితరులు పాల్గొన్నారు.