-పాలకవీడు, జనవరి 27 ;హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా సాగే జాన్‌పహాడ్ ఉర్సులో రెండోరోజైన శుక్రవారం గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. సైదన్న జాతరకు రాష్ట్ర నలుమూలలతోపాటు ఏపీ నుంచి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చిన గంధాన్ని డప్పు చప్పుళ్లు, పక్కీర్ల ఖవ్వాలీ నడుమ చందల్‌ఖానా నుంచి భారీ ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు. ఆరు గంటలపాటు సాగిన ఊరేగింపులో అత్యంత సెంటిమెంట్‌గా భావించే గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతకుముందు చందల్‌ఖానా వద్ద రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గంధం ఎత్తుకుని ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం వారితోపాటు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ కేశవ్ హేమంత్‌పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ దర్గాలోని సైదులుబాబా సమాధి వద్ద ప్రార్ధనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 450 మంది పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
హిందూ, ముస్లింల మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్‌పహాడ్ దర్గా ఉర్సు జన జాతరను తలపించింది. ఉత్సవాల్లో ప్రధానమైన గంధోత్సవం (ఉర్సేషరీఫ్) రెండో రోజు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చిన గంధాన్ని పక్కీర్ల ఖవ్వాలీ, మేళతాళాలతో జాన్‌పహాడ్ దర్గా గ్రామంలో గల వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని చందల్ ఖానాలో అమర్చిన కలశాలలో ఉంచారు. మరో వైపు దర్గా ముజావర్ సయ్యద్జానీ ఇంటి నుంచి గుర్రాలపై తీసుకొచ్చిన గంధాన్ని చందల్ఖానాలో గల గంధంతో కలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు గంధాన్ని ఎత్తుకొని ఊరేగింపును ప్రారంభించారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి పోలీసు బందోబస్తుతో జాన్‌పహాడ్ దర్గా నుంచి కల్మటితండా, జాన్‌పహాడ్ గ్రామాల్లో ఆరు గంటలపాటు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం అందుకోవడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల్లోనే దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్షా, జాన్‌పాక్ సయ్యద్ రహమతుల్లా సమాధులపైకి ఎక్కించారు.
దర్గా పరిసరాలు భక్తజనసంద్రం
ఉర్సుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో దర్గా పరిసరాలు జన సంద్రంగా మారిపోయాయి. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు నుంచి భక్తులు వచ్చి సైదన్నను దర్శించుకున్నారు. భక్తులు సఫాయి బావి వద్ద, మహంకాళీగూడెం పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి దర్గా వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. సైదులు బాబా దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలో వేచిఉన్నారు. భక్తులను నియంత్రించడానికి అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమబద్ధంగా దర్శనాలు చేయించారు. మహిళలు దర్గా ఆవరణలో ఉన్న నాగేంద్రుడి పుట్టలో పాలు, గుడ్లు వేసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు బంధుమిత్రులతో కలిసి జాన్‌పహాడ్ సైదులును దర్శించుకొని కందూరు నిర్వహించారు. ఫాయితాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేశారు. తాత్కాలికంగా వెలిసిన దుకాణాల్లో వ్యాపార లావాదేవీలు భారీగా జరిగాయి. చెరుకు, మిఠాయి, చిన్నపిల్లల ఆట వస్తువుల దుకాణాలు సందడిగా కనిపించాయి. లక్షకు పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
పటిష్ట బందోబస్తు.. పకడ్బందీ ఏర్పాట్లు
ఉర్సు సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. దామరచర్ల, నేరేడుచర్ల నుంచి వచ్చిన భక్తుల వాహనాలు, ఆర్టీసీ బస్సులను పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి వేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 50 మంది సిబ్బందితో మూడు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. దర్గా పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా అగ్ని మాపకశాఖ ఆధ్వర్యంలో ఫైరింజిన్‌ను అందుబాటులో ఉంచారు. కోదాడ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేకంగా 30 బస్సులను నడిపించారు. భక్తులకు దక్కన్ యాజమాన్యం మంచినీటి ప్యాకెట్లు అందజేసింది. జాన్‌పహాడ్ గ్రామంలో బాణోతు రాంబాబు స్వచ్ఛదంగా మంచినీటిని అందజేశారు.
హాజరైన ప్రముఖలు
జాన్‌పహాడ్ సైదన్న ఉత్సవాలకు ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సూర్యాపేట కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు హాజరయ్యారు. వారికి వక్ఫ్‌బోర్డు అధికారులు ఘన స్వాగతం పలికారు. రోప్‌వేతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గా ముజావర్ జానీబాబా సంప్రదాయ స్వాగతం పలికి చేతికి దట్టీలను కట్టి సైదులుబాబా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, సీఈఓ ఖాజామొయినుద్దీన్, ఆర్డీఓ వెంకారెడ్డి, ఎంపీపీ గోపాల్, జడ్పీటీసీ బుజ్జి, తాసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ వెంకటాచారి, సీఐ రామలింగారెడ్డి, దక్కన్ సీజీఎం నాగమల్లేశ్వర్రావు, దర్గా గ్రామ సర్పంచ్ రూపావత్ గోరి, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి, నాయకులు ఉర్సుకు హాజరయ్యారు.