హాలియా, డిసెంబర్ 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అమలౌతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఓ వైపు కేంద్రం, మరోవైపు యూనెసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తుంటే తెలంగాణలో అభివృద్ధి జరుగలేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం అని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. శనివారం హాలియా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. జానారెడ్డి 35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 18 సంవత్సరాలు మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేసినప్పటికీ నియోజకవర్గానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, సాగునీరు, తాగునీటి సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందారన్నారు. తలాపున కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ టేలెండ్ భూములకు సాగునీరు అందించలేకపోయ్యారన్నారు. నెల్లికల్లు లిఫ్ట్, డీ 8,9 కాల్వలపై లిఫ్ట్‌లను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతున్నదన్నారు. మరో నెల రోజుల్లో డీ 8,9 కెనాల్‌పై లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసి కాల్వలకు సాగునీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు.
ప్రజలు జానారెడ్డిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేకపోయినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాగార్జున సాగర్‌లో కమలానెహ్రు ఆస్పత్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.18 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు ఇస్తే తానే బీఆర్ఎస్ కండువా కప్పుకుని ప్రచారం చేస్తానని చెప్పిన జానారెడ్డి నేడు మాట తప్పి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
సమావేశంలో పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు గుంటుక వెంకట్‌రెడ్డి, జయరాంనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మాజీ ఎంపీపీ దూలిపాళ రాంచంద్రయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవినాయక్, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, మండల కో ఆప్షన్ సభ్యుడు బషీర్, బీఆర్ఎస్ నాయకులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గజ్జల లింగారెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
హాలియా, డిసెంబర్ 31 : అనుముల, త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, తిరములగిరి సాగర్ మండలాలకు చెందిన 31 మందికి మంజూరైన రూ.9,67,000 చెక్కులను ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హాలియాలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో పార్వతమ్మ, కృష్ణారెడ్డి, జయ మ్మ, వెంకట్‌రెడ్డి, అంజయ్య, రాంచంద్రయ్య, జానయ్య, బషీర్, లింగారెడ్డి, రాము, వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నియోజకవర్గ ప్రజలకు నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ శనివారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆనందం నింపాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతు ఇంట పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని చేస్తానని తెలిపారు.