సూర్యాపేట టౌన్, మార్చి 15 : రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులతో జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత స్పీకర్‌ను అవమానించాడనే పేరుతో ప్రశ్నించే గొంతు నొక్కడం దుర్మార్గమన్నారు. పదేండ్లు మంత్రిగా, ప్రస్తుత శాసన సభ్యుడిగా దళితుల అభివృద్ధికి జగదీశ్ రెడ్డి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. నేడు ఎంతోమంది దళితులు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారంటే ఆయన ఘనతే అన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ఇటీవల పంటలను పరిశీలించిన ఆయన కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వ్యక్తినే సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఒక జనరల్ స్థానంలో దళిత మహిళను మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే కాంగ్రెస్ నాయకులు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే జగదీశ్‌రెడ్డి చాకచక్యంతో దాన్ని తిప్పి కొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా పారిపోయిన మీరు దళిత స్పీకర్‌ను అవమానించాడని సస్పెన్షన్ చేయడం రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వస్తే దెబ్బలు తినక తప్పదన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రజలు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక జగదీశ్‌రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయాలని పేర్కొన్నారు.