న్యూఢిల్లీ, మార్చి 18 : క్రెడిట్ స్కోర్ తగ్గితే బ్యాంకుల్లో అప్పులే కాదు.. ఉద్యోగాలూ రావు. అవును మరి.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జాబ్స్‌ను ఆశించేవారికి రుణ పరపతి కూడా బాగుండాల్సిందే. లేకపోతే సర్కారీ కొలువులపై ఆశలు గల్లంతే. పీఎస్బీల్లో చేరాలంటే ఉద్యోగార్థులకు క్లీన్ క్రెడిట్ హిస్టరీ తప్పనిసరి అని తాజాగా రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఓ లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. తుది ఎంపికలో అభ్యర్థి క్రెడిట్ స్కోర్ ఎంత? ఉన్నది అని కూడా పరిశీలిస్తారన్నారు. నిత్యం కస్టమర్ల ఖాతాలు, రుణాల మంజూరు, ప్రజాధనంతో లావాదేవీలు నడిచే బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల ప్రవర్తన ఆర్థికపరంగా బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ఉండాలని.. దాన్ని క్రెడిట్ స్కోర్ ప్రతిబింబిస్తుందని చెప్పారు.
అందుకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సిబ్బంది సెలక్షన్ (ఐబీపీఎస్) నిర్వహించే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆయా బ్యాంకుల పాలసీ ప్రకారం రుణ చరిత్ర చక్కగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే బ్యాంక్ ఖాతా/రుణ చరిత్ర లేనివారి విషయంలో బ్యాంకులదే తుది నిర్ణయమని వివరించారు. ఆయా సంస్థల బోర్డులు ఈ అంశాన్ని పరిశీలిస్తాయని వెల్లడించారు. కాగా, గత మూడేండ్లలో 20 మంది అభ్యర్థుల నియామకాలు సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ హిస్టరీ కారణంగా రైద్దెనట్టు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం.