గతంలో చాలాసార్లు చెప్పినా…ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన…నేడు మళ్లీ చెబుతున్నా రేవంత్‌రెడ్డి…నీవు వెళ్లి కేసీఆర్‌ను నీళ్లు ఎలా ఇవ్వాలో అడిగి తెలుసుకో…లేదంటే ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించు…మూడంటే మూడురోజుల్లో జలాలు రైతు ల పొలాల్లోకి పారుతాయని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యు డు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కొని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్హాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని బ్యారేజీలు, రిజర్వాయర్ల వీడియోలతోసహా చూపిస్తూ కాళేశ్వరం-వాస్తవాలు అనే అంశంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పదేపదే సూర్యాపేటకు కాళేశ్వ రం జలాలు రాలేదంటున్నారని, దమ్ముంటే చివరి ఆయకట్టు గ్రామమైన పెన్‌పహాడ్ మండలం చినసీతారం తండాకు వస్తే నీళ్లు వచ్చాయో రాలేదో తెలుస్తుందని, నీళ్లు రాలేదం టే నేను ఉరి వేసుకోవడానికైనా…చెప్పుదెబ్బలకైనా సిద్ధం…లేదంటే అదే తండాకు చెందిన గిరిజన రైతులతో చెప్పుదెబ్బలు తినాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, మంత్రులకు సవాల్ విసిరారు. కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మా జీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నా యకులులతోపాటు సూర్యాపేట నియోజకవర్గం నుం చి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు.
సూర్యాపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ): నాడు ఆంధ్రా పాలకులు పోటీపడి పోతిరెడ్డిపాడును తవ్వి నీళ్ల దొపిడీకి పాల్పడితే అదేస్ఫూర్తితో మన వద్ద ఉన్న గోదావరి నుంచి మన డబ్బులతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం వద్ద గోదారమ్మ గొంతు పట్టి తెలంగాణ రైతుల కోసం నీళ్లు ఇచ్చాడని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు వచ్చిన రైతుల హర్శద్వానా ల మధ్య జగదీశ్‌రెడ్డి చెప్పారు. 2018 నుం చి 2023 వరకు నిరంతరాయంగా ఏటా రెండు పంటలకు నీళ్లివ్వడంతో ఇంచు భూ మి లేకుండా సాగులోకి వచ్చిందని, మళ్లీ మాయదారి కాంగ్రెస్ వచ్చి కానీ చిన్నపాటి సాకును చూపి ప్రాజెక్టును పండబెట్టడంతో బీళ్లుగా మారుతున్నాయన్నారు. పైగా ఆంధ్రాకు నీళ్లను దోచిపెట్టే కుట్రలకు తెరలేపుతూ ఇంటి దొంగలు మనపైనే దాడికి కుట్రలు చేస్తున్నారన్నారు.
కాళేశ్వరం అంటే ఒక్క చోట నిర్మించిన ప్రాజెక్టు కాదని అది అనేక బ్యారేజీల సమూహం అన్నారు. అందులో మొదటిది మేడిగడ్డ బ్యారేజీ అని జగదీశ్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డకు సంబంధం లేకుండానే గోదావరి జలాలు కాలువల్లో పారుతాయని వివరించారు. గోదావరి ప్రాణహిత నదులు కలయిక అనంతరం సుమారు 30కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించగా అక్కడి నుంచి అన్నారం వద్ద సుందిళ్ల తదనంతరం శ్రీపాద యల్లంపల్లి బ్యారేజ్ అక్కడి నుంచి నంది మేడారం రిజర్వాయర్ మీదుగా మిడ్‌మానేరుకు గోదావరి జలాలు చేరుకుంటాయి. ఇక అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి లోయర్ మిడ్ మానేరుకు చేరుకొని నేరుగా బయ్యన్నవాగు…తదనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోకి నీళ్లు ప్రవేశిస్తాయి. మేడిగడ్డకు సంబంధం లేకుండా ప్రస్తుతం నందిమేడారం వద్ద రోజుకు లక్ష క్యూసెక్కుల గోదావరి జలాలు వృధాగా పోతున్నాయని, నందిమేడారం వద్ద పంపులు ఆన్ చేస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరుతాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదు…కొట్టుకుపోలేదని ఇది నగ్నసత్యం అంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వీడియోలు ప్రదర్శిస్తూ జగదీశ్‌రెడ్డి వాస్తవాలను రైతులకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది… కొట్టుకుపోయిందని పదేపదే కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తూ పంటలను ఎండబెడుతూ అక్రమ ఇసుక వ్యాపారానికి కుట్రలకు తెరలేపాయని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కొన్ని మీడియా సంస్థలు తానా అంటే తందానా అంటూ రాగం పాడుతూ బీఆర్ఎస్ను బదనాం ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
కాళేశ్వరాన్ని పండబెట్టింది ఓ పక్క చంద్రబాబుకు నీళ్లను దోచిపెట్టేందుకు కాగా ..మరోపక్క ఇసుక దోపిడీకి తెరలేపారని ఇది నేను ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయాన్ని సందర్శించినప్పుడు తేలిన నిజం అని జగదీశ్‌రెడ్డి అన్నారు. వేలకొద్ది లారీల ఇసుక దందా… నేను స్వయంగా వెళ్లి చూస్తే 9.8 కిలోమీటర్ల దూరం ఒకదాని వెనుక మరొకటి లారీలు బారులుదీరి ఉన్నాయి.. ఇసుకతో వేల కోట్ల రూపాయల దోపిడీ ఉందన్నారు.
కాళేశ్వరమే కాదు…సాగునీటి ప్రాజెక్టులు, బేసిన్లపై కనీస అవగాహన లేని వారు నేడు ముఖ్యమంత్రి, మంత్రులుగా పనిచేస్తున్నారని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. తమకు ఏదో తెలిసినట్లు చెబుతూ అబాసుపాలవుతున్నారన్నారు. రేవంత్ నీకు కనీసం అవగాహన లేదు…దేవాదుల ఎక్కడుంది…? బనకచర్ల ఎక్కడ అని అడిగి ముఖ్య మంత్రిగా నీ ఇజ్జతే కాదు తెలంగాణ ఇజ్జత్ తీశావన్నారు. పైగా కాళేశ్వరంతో 50వేల ఎకరాలకు మించి సాగులోకి రాలేదని అవగాహన లేకుండా పదేపదే రేవంత్ అంటుంటాడని అలా అనడానికి సిగ్గుండాలి అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాత తుంగతుర్తి నియోజకవర్గనాకి 1.25లక్షల ఎకరాలకు అందితే సూర్యాపేట, కోదాడలో కలిసి మరో 1.25 లక్షలు జిల్లాలో మొత్తం 2.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిందని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలో 70 కిలోమీటర్ల దూరం గోదావరి జలాలకు రైతుల జలహారతి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాళేశ్వరం నుంచి కాదు పోచంపాడు నుంచి నీళ్లు తెస్తం అని అన్నాడంటూ మరి ఎందుకు ఇవ్వడం లేదు ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాబేదారులుగా పాలకులు వ్యవహరిస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలైనా…గోదావరి జలాలనైనా కట్టడి చేయడం లేదు… హక్కుగా వినియోగించుకునే సోయి లేకుండా కేవలం డబ్బు సంపాదనే ద్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రధానంగా చంద్రబాబు వద్ద నీటి పారుదల శాఖ కమిషనర్‌గా పనిచేసిన వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టుకోవడం ద్వారా నీకు ఇన్పుట్ ఇచ్చేవారు కూడా తప్పుడుగానే ఉంటాయన్నారు.
నీళ్ల విషయంలో ఏపీకి లబ్ధి చేకూరేలా కాళేశ్వరం ప్రాజెక్టును పండబెడుతున్న ఇంటి దొంగల భరతం పట్టాల్సిందేనని జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాడు చంద్రబాబు, వైఎస్ఆర్ ఆంధ్రాకు లబ్ధి చేకూరే విధంగా ఏది చేసినా.. ఒకరికి ఒకరు సహకరించుకున్నారని అందులో భాగంగా పోతిరెడ్డిపాడును తవ్వుకొని నీళ్లను దోపిడీ చేశారన్నారు. కానీ ప్రస్తుతం బ్రోకరుగాండ్లు ఇంటి దొంగల్లా తయారై మన వనరులను దోచి పెట్టేందుకు గురుదక్షిణగా నీళ్లను ధారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. మరోపక్క చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రేవంత్ అంటున్నాడని, అసలు చర్చలు ఎందుకు…దోచుకునే వాడితో చర్చలేంది.. దొంగతనానికి వచ్చే వారితో చర్చలేంది…ఎంత దోచుకుంటావు…నాకు ఎంత ఇస్తావని చర్చిస్తారా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాళేశ్వరం జలాల కోసం సూర్యాపేట జిల్లా నుంచే ఉద్యమం ప్రారంభం కావాల్సి ఉందని, లక్షమంది రైతులతో ప్రాజెక్టుల వద్దకు వెళ్లేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వీడియోల్లో చూపించిన దానిపై ఎక్కడికక్కడ చర్చ పెట్టాలి… కేసీఆర్ హయాంలో నీళ్లు ఇలా వచ్చాయి… ఇప్పుడు ఎందుకు రావట్లేదో చర్చించాలని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం కూలలేదు… ఇప్పటికిప్పుడు అనుకున్నా నీళ్లు ఇవ్వవచ్చు అనే విషయం మీకు తెలిసింది…దీనిపై సూర్యాపేట నుంచే ఉద్యమం ప్రారంభం కావాలి. సూర్యాపేట జిల్లా నుంచి లక్షమంది రైతులు సిద్ధమై కాళేశ్వరాన్ని రక్షించుకుందామన్నారు.
మేడిగడ్డ పిల్లర్ కుంగడంతో కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ప్రచారం చేస్తూ ప్రాజెక్టును పండబెట్టడం వెనుక స్వామి కార్యం, స్వకార్యం ఉందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి తన గురువు కోసం నాడు యాభైలక్షలు ఇచ్చి ఎమ్మెల్సీని కొనబోయి ఫెయిలై జైలుపాలు కావడంతో నేడు అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి కాగా తెలంగాణకు వరప్రదాయని అయిన కాళేశ్వరాన్ని పండబెట్టి చంద్రబాబు నిర్మించతలపెట్టిన బనకచర్లకు మేలు చేసేందుకు కుయుక్లు పన్నుతున్నారని ఇది గురుదక్షిణే అన్నారు. సాధారణంగా బావుల వద్ద మోటర్లు కాలినా… పైపులు పగిలినా వెంటనే మరమ్మతులు చేస్తామని కానీ, కేసీఆర్ నిర్మించిన భారీ ప్రాజెక్టుకు చిన్న మరమ్మతులు చేయడం లేదన్నారు. కాళేశ్వరాన్ని పండబెట్టడం ద్వారా గోదావరి ఎండడం…ప్రాణహిత ద్వారా ఏపీకి నీళ్లు పోవడం తద్వారా బనకచర్లకు మేలు జరుగుతుందని ఇదే చంద్రబాబుకు కావాల్సింది అని జగదీశ్‌రెడ్డి చెప్పారు.
కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ద్వారా పంటలకు వచ్చే నీళ్లను చూశాను. నేను మనసులో అనుకునేవాడిని అక్కడెక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇక్కడకు నీళ్లేలా వస్తున్నాయో అని… ఇవాళ మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి కాళేశ్వరంపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టును కండ్లకు కట్టినట్లుగా చూపించారు. నిజంగా కాళేశ్వరం కేసీఆర్ తెచ్చిన అద్భుతమైన ప్రాజెక్టు. రైతుల వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కండ్లల్లో ఆనందం నింపిన ప్రాజెక్టు. ప్రాజెక్టును నడిపించకుండా రైతుల పంటలు ఎండబెట్టడమే కాకుండా కాళేశ్వరంపై కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు మాయ మాటలు చెప్పడం తగదు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసి రైతులకు ఆదుకోవాలి.
తెలంగాణ రైతుల కోసం దాదాపు 40లక్షల ఎకరాలను పారించేందుకు ముందుచూపుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. జగదీశ్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో కాంగ్రెస్ నాయకుల మాయమాటలు బట్టబయలయ్యాయి. ఒక్క పిల్లర్ కూలినందుకే ప్రాజెక్టు మొత్తం కూలినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతాంగంతో ఆటలాడుతున్నారు. కూలిన పిల్లర్‌తో సంబంధం లేకుండా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసే అవకాశం ఉన్నా.. కేసీఆర్‌కు పేరొస్తుందని కాంగ్రెసోళ్లు నీళ్లు విడుదల చేయడం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలి.
తెలంగాణ రైతుల కోసం గోదావరి గొంతు పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కానీ కాంగ్రెస్, బీజేపీ, ఉమ్మడి ఆంధ్ర పాలకులకు ఈ విషయం మింగుడుపడడం లేదు. అందుకే వారంతా ఏకమై కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చిత్రీకరిస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉన్నా కేసీఆర్‌కు పేరొస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుంది. కేసీఆర్ తెలంగాణ రైతాంగం కోసమే కాళేశ్వరాన్ని కట్టాడని, అది ఆలోచించకుండా పక్క రాష్ర్టాలతో చేతులు కలిపి మన ప్రాజెక్టులను మనమే చెడుగా ప్రచారం చేసుకోవడం తగదు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోయి తెచ్చుకొని కాళేశ్వరాన్ని నడిపించి రైతులకు నీళ్లు ఇవ్వాలి.
నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లతో సాగు బాగా సాగింది. చెరువులు కుంటల్లో నీరు చేరి పంటల దిగుబడి కూడా బాగానే వచ్చింది. మాయదారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నీళ్లు లేకుండా చేసింది. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు.. మీరెందుకు ఇయ్యరు అంటే కాళేశ్వరం కూలిందని చెడు ప్రచారం చేస్తున్నారు. కూలిన కాళేశ్వరంపై 9 కి.మీ. మేర లారీలను నిలిపి ఇసుక తోలకంపై ఉన్న సోయి ముఖ్యమంత్రి, మంత్రులకు రైతులకు నీళ్లివ్వడంపై లేదు. కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న చెడు ప్రచారం బట్టబయలైంది. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఆన్ చేసి రైతుల పంటలకు నీళ్లివ్వాలి.