మిర్యాలగూడ, జూన్ 17 : ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్, డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమంలో ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డిజిటల్ సభ్యత్వాల కోఆర్డినేటర్, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. మోదీ, చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే రేవంత్‌రెడ్డి అని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి.. ఓట్లు చోరీ చేయకుండా ఉండడన్నారు.
బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉంటూ అసలైన ఓటర్లను తొలిగించకుండా చూడాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కరెంట్ పోయింది, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా ఇచ్చిన నీళ్లూ పోయాయి.. రైతుబంధు పోయింది…యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కేసీఆర్ లేడు.. కరెంట్ లేదు.. తాగునీరు లేదంటే.. కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేడు.. యూరియా లేదనే మాటలు వింటున్నామని, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దామరచర్లలో పవర్ ప్లాంట్ తెచ్చుకున్నది స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికేనన్నారు. కానీ దాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి ఉద్యోగాలను ప్రైవేటోళ్లకు దోచిపెడ్తామంటే ఒప్పుకునేది లేదంటూ స్థానికులకు అభయమిచ్చారు. ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరి తరఫున పోరాటం చేస్తామని, పోరాటంలో స్వయంగా పాల్గొంటానన్నారు.
ఆరోజు ఏదైతే మాట ఇచ్చామో, ఎవరైతే నష్టపోయారో వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్‌పై పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. నాడు ప్రజలను ఒప్పించి పవర్ ప్లాంట్ తెచ్చుకున్నామన్నారు. తాము అధికారంలోకి రాగానే పవర్ ప్లాంట్‌ను రద్దు చేస్తాం, క్లోజ్ చేస్తామని జిల్లాకు చెందిన మంత్రి మాట్లాడాడన్నారు. ప్లాంట్ చుట్టుపక్క గ్రామాల్లోని నిర్వాసితులకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ కొట్లాడుతుందని, వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. నాడు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కొట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే ఆ లిఫ్టు పనులను నేటికీ పూర్తి చేయకుండా పక్కకు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ కాంట్రాక్టర్ల నుంచి, రియల్టర్ల నుంచి రైసు మిల్లర్ల వరకు డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు.

కేసీఆర్ నాయకత్వంలో మనం కడుపు కొట్టుకొని ప్రజల వద్దకు వెళ్లి పనిచేశామని, కానీ కాంగ్రెస్ నాయకులు కడుపు నింపుకొని ప్రజల కడుపులు కొడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఉన్న నాడు సంపాదించినా, అప్పు చేసినా ప్రజల కోసమే చేశారని నాడు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందాయన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చిన నాడే రైతుబంధు వస్తుందని అన్నారు. మళ్లీ 2014 కంటే ముందు ఏ దుర్మార్గ పాలన ఉందో అదే దుర్మార్గమైన పాలన రాష్ట్రంలోకి వచ్చిందన్నారు. నాడు కేసీఆర్ నిత్యం ప్రజల కోసం పరితపించేవాడని రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేవారని, ఇరిగేషన్లో ఏం జరుగుతోంది.. వ్యవసాయం ఎలా సాగుతోంది..అనే విషయమై ప్రతి నిమిషం అధికారులు సీఎంకు విన్నవించేవారన్నారు. కానీ ప్రస్తుత సీఎం అధికారులు నా మాట వింటలేరు.. అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాడు కేసీఆర్‌ది స్కీంల ప్రభుత్వమైతే ఇప్పుడు కాంగ్రెస్‌ది స్కామ్‌ల ప్రభుత్వమన్నారు. ఏమన్నా అంటే నేను హిట్లర్‌ను.. అని మాట్లాడుతుండని, పరిపాలన తెలియని మూర్ఖుడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు దేనికీ భయపడొద్దు ఎవరిమీద కేసులు పెట్టినా అవి నిలబడవన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులను ఎత్తివేస్తామని ప్రకటించారు. బెంగాల్, బీహార్ రాష్ర్టాల్లో ఓట్ల చోరీ జరిగి అక్రమ మార్గంలో బీజేపీ గెలిచిందన్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలో కూడా అదే జరుగుతుందని, బీఎల్ఏలు సర్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, పాలుట్ల బాబయ్య, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మోహిసిన్ అలీ, నల్లమోతు సిద్ధార్థ, ఇలియాస్, హాతీరాం, చిట్టిబాబు నాయక్, పెద్ది శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, తండాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. రైతులందరికీ సరిపడా ఎరువులు, విత్తనాలు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నాటి సీఎం కేసీఆర్ హయాంలో 13 సార్లు రైతులకు రైతుబంధు ఇచ్చి చరిత్ర పుటల్లో నిలిచారని అన్నారు.
సర్‌పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి గణనను సీరియస్‌గా తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్ సూచించారు. ప్రతి గ్రామానికి చెందిన బీఎల్ఏలు సర్ ప్రక్రియ ముగిసేవరకు ఉండాలని అన్నారు. సర్ ప్రక్రియ పేరుతో దేశవ్యా ప్తంగా బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఓట్లను తొలిగిస్తోందని, ఈ విషయంపై బీఆర్ఎస్ శ్రేణు లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి సర్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా వస్తుందని, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవరించుకోవాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ఇటీవల జరిగిన సర్వేలో మొదట గెలిచే సీటు మిర్యాలగూడఅని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ సైనికుల్లా పనిచేస్తున్నారని, ఇదే రీతిలో మరో రెండేండ్లు పని చేయాలని సూచించారు.
ఉద్యమాలు చేసి రా ష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యా క పదేండ్ల పాటు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. నాడు అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందుకు పోయిందని, నేడు రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు.