సూర్యాపేట, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ఏడాదిన్నరగా రైతులను ఎండబెడుతూ కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఏకై క లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతో బీజీపీ, కాంగ్రెస్ పార్టీలు వండి వార్చినదే కాళేశ్వరం రిపోర్టు తప్ప అం దులో కించిత్ వాస్తవం లేదన్నారు.
బనకచర్ల కోసం కాళేశ్వరాన్ని పండబెడుతూ తెలంగాణాను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు మరో మూడేండ్లు కొనసాగుతాయని, తరువాత అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కాళేశ్వరం నీళ్లను చివరి ఇంచు వరకు ఇస్తామని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తుందని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో నాడు ఓట్లు వేయించుకొని నేడు జంతర్‌మంతర్ వద్ద సర్కస్ ఫీట్లు వేస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్ మండలంలో రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ పంపిణీ అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎవరెన్ని అన్నా.. కాళేశ్వరం తెలంగాణకు జీవనాధారమని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి బతికిస్తాడన్నారు. మోదీ, చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్‌ను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని, కాళేశ్వరం నివేదిక పేరుతో కాంగ్రెస్ మోసపూరిత ప్రచారం చేస్తుందన్నారు. అరెస్టులు ఉండోచ్చని చిల్లర ప్రచారం చేస్తున్నారని, పత్రికల్లో విషపు రాతలు రాయిస్తున్నారన్నారు. ఇలాంటివి ఉద్యమం నుంచి వచ్చినోళ్లం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అసలు కమిషన్ రిపోర్టు తొక్కిపెట్టి కాంగ్రెస్ సొంత కథలు అల్లుతుందన్నారు. డైవర్షన్ పొలిటిక్స్‌తో విషప్రచారం చేసి మరోసారి ప్రజల్ని మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు.
రెండేండ్లుగా చెప్పిందే చెప్పి కేసీఆర్‌పై ఏడుపు తప్ప ఒరగబెట్టిందేమీ లేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరన్నారు. కేసీఆర్ ముందుచూపు పాలనే తెలంగాణలో నేడు అద్భుత ఫలితాలంటూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అన్ని రంగాల్లో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ చేసిన కేసీఆర్‌కు మరింత పేరొస్తుందని గ్రహించి విషం కక్కుతోందన్నారు. వరుస మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తుందని ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్‌లో భాగమేనని చెప్పారు.
ఇటీవల తాను కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో అందరికీ చూపిస్తూ వివరించానని ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగిస్తే మూడంటే మూడు రోజుల్లో నీళ్లిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కుట్రలు తప్ప రైతులకు నీళ్లివ్వాలనే ఉద్దేశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కుట్రలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బీసీ రిజర్వేషన్ పేరుతో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఓట్లు వేయించుకొని నేడు జంతర్‌మంతర్ వద్ద సర్కస్ ఫీట్లు చేస్తుందని ఎద్దేవా చేశారు.