సూర్యాపేట, అక్టోబర్ 3 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ నూతన వస్ర్తా లు ధరించారు. ఇంటి గుమ్మాలను బంతిపూలతో అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, సంతోషిమాత, వేదాంత భజన మందిరం, అయ్యప్పస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, అయ్యప్పస్వామి ఆలయాలతోపాటు సూర్యాపేట మున్సిపాలీటీ ఆధ్వర్యంలో జమ్మిగడ్డలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శమీ వేడుకల్లో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా పూజలు చేశారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లను గాల్లోకి ఎగరేసి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. జగదీశ్‌రెడ్డితో ప్రజలు, యువత పెద్ద ఎత్తున సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేశారు. సంతోషిమాత ఆలయం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కైలాస శంకరులను దర్శించుకున్నారు. పట్టణ ప్రజలు సుమారు 70వేల మంది పాలపిట్టను తిలకించారు. భక్తులు కోరికలను ఓ చీటిపై రాసి జమ్మి చెట్టు కు కట్టారు. సూర్యాపేట సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు.
విజయదశమి పండుగ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జమ్మి ఉత్సవాల్లో సంతోషిమాత దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైలాస శంకరులను భక్తులు పెద్ద ఎత్తును దర్శించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి క్యూ లైన్లను ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శు లు నూకా వెంకటేశం, బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, పబ్బా ప్రకాశ్, గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్, అక్టోబర్ 3: ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ పండుగ రోజు అందరికీ విజయం కలగాలి’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. దసరా సందర్భంగా నకిరేకల్‌లోని సాయిబాబా గుడి, పట్టణంలోని వైఎన్ నగర్లో గురువారం జరిగిన విజయదశమి వేడుకల్లో చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నవీన్‌రావు, ప్రధానకార్యదర్శి కేశవరాజు, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, సీనియర్ నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ శ్రవణ్, పేర్ల కృష్ణకాంత్ పాల్గొన్నారు.
రామగిరి, అక్టోబర్ 3: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి స్వగ్రామం ఉరుమడ్లలో, నల్లగొండ వీటీ కాలనీలో నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్నారు. రాక్హీల్స్ కాలనీలో దుర్గామాత విగ్రహం వద్ద బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, కమల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 48వ వార్డు నాగార్జున కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శమీ పూజలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి పూజలు చేశారు.