ఆత్మకూర్.ఎస్, మే 26: రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఇందులో సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను సోమవారం పరిశీలించి మాట్లాడారు. రైతులంతా తమ సమస్యలు పరిష్కరించాలని ఆయనకు మొర పెట్టుకున్నారు.
రెండు నెలలవుతున్నా ధాన్యాన్ని కాంటా వేయకపోవడం దురదృష్టకరమన్నారు. వడ్లు ముక్కి మొలకలు వస్తున్నాయని, 60 రోజులైనా వడ్లు కొనలేదంటే ఇంత కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. ఐకేపీ కేంద్రాల్లో ఫార్‌బాయిల్డ్ వాసనలు వస్తున్నాయన్నారు. నీళ్లు రాక అరకొర గా పండిన పంట మొలకలు వచ్చాయన్నారు. రుతు పవనాలు వచ్చి దుక్కి దున్నాల్సిన రైతు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తుందన్నారు. కాంటా అయ్యాక మిల్లుల్లో రైతులతో బేరాలాడుతున్నారని, రెండు మూడు రోజులకోసారి వచ్చే లారీలు, సరిపడా గోనె సంచులు లేక రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన చెందారు.
రైతులు దళారుల కాళ్లు పట్టుకునే దుస్థితి దాపురించిందని, రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేసిందన్నారు. గింజ లేకుండా వెంటనే కొనుగోలు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి నెలలు గడుస్తున్నా కాంటా వేయడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి వెంట మాజీ ఎంపీ బడగుల లింగయ్యయాదవ్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తూడి నరసింహారావు, మర్ల చంద్రారెడ్డి, బ్రహ్మం, బాలసైదులు, పుట్ట కిశోర్, భిక్షం, జీవన్‌రెడ్డి, మల్లారెడ్డి, దామిడి శ్రీను, బషీర్, సోమిరెడ్డి, వెంకటరెడ్డి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.